News

ప్రధాని దీపావళి విందులో నాన్ వెజ్, లిక్కర్.. హిందువుల ఆగ్రహం

221views

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పై హిందువులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇటీవలే ప్రధాని కీర్ స్టార్మర్ తన నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్ లో దీపావళి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా హిందువులకు ఆతిథ్యమిచ్చారు. అయితే… ఈ పండుగ విందులో హిందువులను అవమానపరిచే విధంగా, పండుగ ప్రాముఖ్యాన్ని తగ్గించే మాంసాహారం, లిక్కర్ ను కూడా అందించారని బ్రిటన్ హిందువులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దీనిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని కార్యాలయానికి గానీ, ప్రధాని కీర్ స్టార్మర్ కి గానీ హిందూ పండుగలపై, విశిష్టతపై అవగాహన లేదా? అంటూ మండిపడ్డారు. అసలు ఆధ్యాత్మిక కోణంపై అవగాహన వుందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీపావళి అనేది వేడుక మాత్రమే జరుపుకునే పండుగ కాదని, దానికి ఆధ్యాత్మికమైన, మతపరమైన కోణం కూడా వుందని అక్కడి హిందూ సంస్థ ఇన్ సైట్ పేర్కొంది.

భక్తికోణం, లక్ష్మీ దేవితో ముడిపడి వున్న పండుగ అని, అందుకే ఇలాంటివి కుదరవన్నారు. మరోవైపు ప్రముఖ బ్రిటీష్ హిందూ పండిట్ సతీష్ శర్మ కూడా స్పందించారు. ప్రధాని కార్యాలయం ఇచ్చిన ఆతిథ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 14 సంవత్సరాలుగా 10 డౌనింగ్ స్ట్రీట్ లో దీపావళి వేడుకలు జరిగాయని, ఎన్నడూ ఇలాంటి పదార్థాల జోలికి వెళ్లలేదన్నారు. ఈ దీపావళి వేడుకల్లో మాత్రం మాంసాహారం వడ్డించారని, ఆధిపత్య ధోరణిని ప్రదర్శించారని దుయ్యబట్టారు. ప్రధాని సలహాదారులు అత్యంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారన్నారు. హిందూ సమాజానికి ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు దీనిపై ప్రధాని కార్యాలయం కూడా అంత తీవ్రంగా స్పందించలేదు. నేరుగా వ్యాఖ్యానించనూ లేదు. ఇది బహుళ సాంస్కృతిక కార్యక్రమమని పేర్కొంది.