
సుప్తావస్థలో ఉన్న జాతిని జాగృతం చేయడం కోసం గత వైభవ స్మరణ ఎంతో అవసరమని జేఎన్‌టీయూ న్యూఢిల్లీ వీసీ ప్రొఫెసర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ అన్నారు. నన్నయ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ అండ్ కామర్స్ ఆంగ్ల విభాగం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి, సెంటర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టడీస్ (కాప్స్) సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతిశ్రీ మాట్లాడుతూ తెలుగు వైభవాన్ని భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలకు తెలియజేయాలన్నారు. దేశంలో భాషాభిమానం అధికంగా ఉన్న వారిలో తమిళనాడు మొదటి స్థానంలో ఉంటుందన్నారు. తెలుగు వారూ అలాంటి భాషాభిమానాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. కందుకూరి, గురజాడ వంటి మహనీయులు మన సంస్కృతిలో భాగమన్నారు.
ఉద్ఘాటించిన ప్రముఖులు
నన్నయ వీసీ ఆచార్య వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో భాష, సాహిత్యం ఇతిహాసాలు లిఖిత పూర్వకంగా ఉన్న సంస్కృతి తక్కువగా ఉందన్నారు. సదస్సులోని ప్రధాన అంశాలను సమాజానికి అందించే విధంగా డాక్యుమెంటేషన్ చేయాలన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య.జి.సుధాకర్ మాట్లాడుతూ నన్నయ విశ్వవిద్యాలయం సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తుందన్నారు. కాప్స్ అధ్యక్షుడు కర్రి రామారెడ్డి మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో, ఉపాధి అవకాశాల నేపథ్యంలో సామాజిక అంశాలను విస్మరిస్తున్నారన్నారు. కాప్స్ ఉపాధ్యక్షుడు ఆచార్య జి.నాగేశ్వరరావు, అటవీశాఖ విశ్రాంత అధికారి నళిని మోహన్ తదితరులు ప్రసంగించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సదస్సులో ఆచార్య కేఎస్.రమేష్, ఆచార్య డి.జ్యోతిర్మయి, డా.ఎన్. సజనారాయ్, ఓలేటి సత్యనారాయణ పాల్గొన్నారు.





