News

భక్తుల స్పాట్ బుకింగ్ పై దేవస్వమ్ బోర్డు స్పష్టత

212views

శబరిమల దర్శనానికి వచ్చే భక్తుల స్పాట్ బుకింగ్ పై దేవస్వమ్ బోర్డు స్పష్టత ఇచ్చింది. వర్చువల్ క్యూ బుకింగ్ లేకుండా వచ్చే భక్తుల కోసం మూడు చోట్ల స్పాట్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టాలని బోర్డు నిర్ణయించింది. అయితే స్పాట్ బుకింగ్ కోసం భక్తుల దగ్గర తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. స్పాట్ బుకింగ్ చేసుకునే వారికి ఫొటోతో కూడిన ప్రత్యేక పాస్ కూడా ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది. క్యూఆర్ కోడ్ ద్వారా స్పాట్ బుకింగ్ చేసుకున్న యాత్రికుల సమాచారం అంతా తెలుసుకునే విధంగా పాస్ ఇవ్వనుంది. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను సిద్ధం చేయనున్నట్లు దేవస్థానం బోర్డు తెలిపింది. కాగా, స్పాట్ బుకింగ్ ద్వారా శబరిమల అయ్యప్పను రోజుకు 10,000 మంది దర్శనం చేసుకోవచ్చు. వర్చువల్ క్యూ బుకింగ్ ద్వారా 70,000 మంది దర్శనం చేసుకోవచ్చు.

పంబా, ఎరుమేలి, సత్రంలో స్పాట్ బుకింగ్ కౌంటర్లు తెరవనుంది దేవస్థానం బోర్డు. పంబా రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్కడ కౌంటర్ల సంఖ్యను పెంచనుంది. కానీ నిలక్కల్, పంతలంలో కౌంటర్ ఏర్పాటు చేయకపోవడం వల్ల పంబాలో ట్రాఫిక్ పెరుగుతుందనే ఆందోళనలు ఉన్నాయి. అయితే ఇరుముడికట్టుతో వచ్చే యాత్రికులు ఎవరూ అయ్యప్ప దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లిపోకుండా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.