
అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం అంటే వరి, గోధుమ, జొన్న తదితర ధాన్యాలే కాదు. ప్రాణాన్ని నిలిపి, చైతన్యవంతంగా ఉంచి, ఆలోచించగల శక్తినిచ్చే ఏ ఆహారమైనా అన్నమే. ఇక్కడ ప్రాణి అంటే మానవులూ, పశు పక్ష్యాదులూ అనుకుంటే పొరపాటే. సృష్టి మొత్తానికి ఆహారాన్ని అందించే చెట్లు కూడా ప్రాణులే. అవి అచలాలే కావచ్చు కానీ వాటికీ స్పందనలుంటాయని శాస్త్రవేత్తలు చెప్పారు. సరైన ఆహారం అందించినట్లయితే మొక్క ఫలవంతమైన వృక్షంగా పరిణతి చెందుతుంది. అచ్చం అలాగే పశుపక్ష్యాదులతో పాటు మనిషి కూడా అంతే ఫలవంతమైన జీవితాన్ని కొనసాగించగలడు. ప్రకృతి నుంచి ఆహారాన్ని గ్రహించి పశు పక్ష్యాదులకూ మనుషులకూ దాన్ని అందించి మహోపకారాన్ని చేస్తోంది ఆకుపచ్చని వృక్షలోకం. ఆ రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేనిది.
ఇక పశుపక్ష్యాదుల విషయానికి వస్తే, వాటి జీవన విధానం యుగయుగాలనుంచీ ఒకటే. ఆకలి వేసినప్పుడు మాత్రమే కడుపు నింపుకుంటాయవి. ప్రకృతి ధర్మానికి ఏనాడూ విఘాతం కలిగించవు. తిండీ నిద్రా శారీరక వాంఛలు తీర్చుకోవడం తప్ప, విజ్ఞానాన్ని పొందే అవకాశం లేని ఆ మూగజీవులు ప్రకృతితో మమేకమై, అన్నాన్ని పొందుతాయి. వాటి ఉనికి ప్రకృతికి చేసేది మేలే తప్ప కీడు కాదు.
ఆలోచించగల మనసు, సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగే మేధ ఉన్న మనిషి మాత్రం ప్రకృతికి చేస్తున్న కీడు అంతా ఇంతా కాదు. అమృతమయమైన ఆహారాన్ని వ్యర్థం చేస్తున్నాడు. తినరాని వాటిని, తినలేని వాటిని తింటూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నాడు. ఆ క్రమంలో క్వింటాళ్ల కొద్దీ అన్నం అన్నార్తులకూ అభాగ్యులకూ అందకుండా వృథా అయిపోతోంది. ఇది ముమ్మాటికీ తప్పే. అలా చేస్తే- ఆరుగాలం ఆటుపోట్లకు ఓర్చి, తినీ, తినక లోకానికి అన్నాన్ని అందించే అన్నదాతను అవమానించినట్లే. తనని ఛిద్రం చేసినా, రసాయనాలతో కలుషితం చేసినా, అతివృష్టికి, అనావృష్టికి తట్టుకుని మరీ తన బిడ్డల కోసం ఆహారాన్ని అందించే భూమాతని సైతం బాధపెడుతున్నట్లే. ‘అన్నమధికమైన నది తను జంపును’- తిండి ఎక్కువైతే అనారోగ్యంతో చనిపోవాల్సి వస్తుంది. అసలు తినకపోతే ఆత్మారాముడు క్షోభిస్తాడు. ప్రాణం తీసినా, నిలబెట్టినా ‘బువ్వ’కే సాధ్యం అంటాడు వేమన. అలాంటి ఆహారాన్ని సక్రమంగా వినియోగించాలి. అదే అన్నశాంతి.
ఆహారానికి పాత్రశుద్ధి, పాకశుద్ధి, పదార్థశుద్ధి ఉండాలి. అది మనసును నిర్మలం చేయాలి. మంచీచెడుల స్పృహ కలిగించాలి. ‘బ్రహ్మార్పణం’ అంటూ మనలోని పరబ్రహ్మకు ఆహారాన్ని అర్పించడం ఒక యజ్ఞం. ఒక సుకృతి. ప్రకృతిలో కలిసిపోయే శరీరానికి, ప్రకృతిలో లభించే ఆహారంతో సంతృప్తిని కలిగించి జీవితాన్ని సాగించడమే సత్కర్మ. మనసును నియంత్రించే సాత్వికాహారానికి మనిషి ప్రాధాన్యమివ్వాలి. ప్రకృతిలో ఒక భాగంగా మసలి, మనగలిగిననాడు మనిషి మహితాత్ముడవుతాడు.





