
‘‘కులం, మతం అనే సంకెళ్ళలో ఆర్ఎస్ఎస్ చిక్కుకోలేదు. వారి దృక్పథం ఉదారమైనది, ఆ సంస్థ దేశాభివృద్ధి కోసమే పనిచేస్తుంది’’ అన్నారు మళయాళీ చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖ సంగీత విద్వాంసుడు మేచేరీ లూయీ ఊసెప్పచన్. దసరా పండుగ రోజు త్రిశూర్‌లో జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విజయదశమి ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
‘‘తమ పూర్తి జీవితాన్ని ఆర్ఎస్ఎస్ సేవకు అంకితం చేసిన సంఘ ప్రచారక్‌లు సాధుసంతులకు ఏమాత్రం తీసిపోరు. వారు ఈ ప్రాపంచిక సుఖాలను వదిలిపెట్టి దేశం కోసం పనిచేయడాన్ని ఎంత ప్రశంసించినా సరిపోదు’’ అని ఊసెప్పచన్ అభిప్రాయపడ్డారు.
‘‘నేను ఈ కార్యక్రమానికి ఎలాంటి రాజకీయ ఉద్దేశాలతోనూ రాలేదు. రాజకీయాలు మంచివే, అవసరం కూడా. ఈ వయసులో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సునాయాసంగా యోగా చేస్తారు. దానివల్లే ఆయనకు వర్తమాన రాజకీయాల్లో నైపుణ్యంతో వ్యవహరించే శక్తినిచ్చింది. ఆర్ఎస్ఎస్‌లో పాటించే క్రమశిక్షణ గురించి చెప్పుకుని తీరాల్సిందే. ఒక వక్త మాట్లాడుతుంటే దానికి చప్పట్లు కొట్టడం కంటె, ఆ వక్త చెబుతున్న విషయాలను గ్రహించి వాటిగురించి చర్చించడానికే సంఘంలో ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడికి వచ్చి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే… సంఘ కార్యకర్తలు మానవాళి సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తారు’’ అని ఊసెప్పచన్ తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు.
మేచేరీ లూయీ ఊసెప్పచన్ మతపరంగా క్రైస్తవుడు. ఆయన విజయదశమి వేడుకలకు, అది కూడా ఆర్ఎస్ఎస్ ఉత్సవానికి హాజరవడాన్ని కొందరు క్రైస్తవులు తప్పుపట్టారు. అలాంటి వారి విమర్శలకు ఆయన జవాబిచ్చారు. ‘‘వారు నన్ను గౌరవంగా పిలిచారు. నా సంగీతమంటే అభిమానం ఉన్న కొంతమంది వ్యక్తులు, తమ సంస్థ విజయదశమి నాడు శతజయంతి జరుపుకుంటున్న సందర్భంగా నన్ను ఆహ్వానించారు. అందుకే నేనా వేడుకకు హాజరయ్యాను. ఆ సమయంలో నేను సరైనది అనుకున్న విషయాలనే మాట్లాడాను. నేనొక సంగీత విద్వాంసుణ్ణి. నేను ఆ కార్యక్రమానికి మర్యాద కోసం, గౌరవంతో హాజరయ్యాను’’ అని ఊసెప్పచన్ చెప్పారు. ‘‘ఆ వేడుక తర్వాత చాలామంది నాతో మాట్లాడారు. వారిలో కొంతమంది, సంఘ కార్యక్రమంలో పాల్గొనాలన్న నా నిర్ణయంతో ఏకీభవించలేదు’’ అని కూడా వివరించారు.
‘‘ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరవడానికి ముందు నేను ఆ సంస్థ గురించి కొంతమంది మిత్రులను అడిగాను. వారిలో కనీసం ఒక్కరైనా సంఘ్ గురించి చెడుగా ఒక్కమాటైనా పలకలేదు. ఆ కార్యక్రమానికి వెళ్ళాక, కొందరు స్వయంసేవకులు సన్యాసజీవితం గడుపుతారని తెలుసుకున్నాను. వారు తమ జీవితాలను సంస్థ కోసం, దేశం కోసం అంకితం చేసేసారు. వారు పెళ్ళి చేసుకోవాలనుకుంటే ఈ సంస్థను వదిలిపెట్టాల్సిందే. నాకు సంఘ్ పద్ధతులు నచ్చాయి, నా ఆలోచనలను మాటల్లో పెట్టానంతే’’ అని అని ఆయన జవాబిచ్చారు.
త్రిశూర్‌లో జరిగిన ఆర్ఎస్ఎస్ విజయదశమి ఉత్సవంలో, సంస్థ దక్షిణ క్షేత్రీయ సహకార్యవాహ ఎం రాధాకృష్ణన్ మహానగర్ సంఘచాలక్ ప్రొ.పివి గోపీనాథన్ తదితరులు పాల్గొన్నారు.





