
ఆధ్యాత్మిక ప్రపంచంలో సేవకు చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే ‘మానవసేవే మాధవసేవ’ అన్నారు. ఆ సేవ మొక్కుబడిగా కాకుండా ప్రేమ నిండిన హృదయంతో చేయాలి. అలా కాని పక్షంలో అది వ్యర్థమే. ప్రదర్శన కోసం, పేరుప్రతిష్ఠల కోసం చేసే సేవలు హీనమైనవి. ఆడంబరంగా చేసే సేవ అహంకారాన్ని పెంచితే, ప్రఖ్యాతిని ఆశించి చేసే సేవ గర్వాన్ని ఇస్తుంది. సేవ అనేది తమకు అనువైన విధంగా ఉండాలి. ఇతరులతో పోల్చుకుని.. శక్తికి మించిన సేవ చేయాలనుకుంటే.. అది అనారోగ్యాన్ని, దారిద్య్రాన్ని తెచ్చిపెడుతుంది. ఉన్న శక్తిని వినియోగించటం లేదంటే వారు జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారన్నమాట. మనం గర్విష్ఠి, అహంకారి, రోగి, పేద- కాకూడదంటే.. సేవను కర్తవ్యంగా గుర్తించాలి. నిస్వార్థసేవ మనకు, మన కుటుంబానికీ కూడా ఉజ్జ్వల భవిష్యత్తును అందిస్తుంది. సమాజ సేవ సర్వేశ్వరుడి సేవ అవుతుంది, పుణ్యలోకాలను ప్రాప్తింపచేస్తుంది. ఆపదలో ఉన్నవారిని ఆదరించినప్పుడు.. ఆ సేవ పొందిన వారు అక్షయమైన దీవెనలు కురిపిస్తారు. ఇందులో సందేహం లేదు. ఇది స్వామి వివేకానంద ఉద్బోధ.





