ArticlesNews

ఆలయ భద్రత మల్లన్నకెరుక!

381views

రాష్ట్రంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో శ్రీశైలం రెండోది. రోజూ వేల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. శ్రీశైల ఆలయ భద్రత, దేవస్థాన రక్షణ బాధ్యతలు దేవస్థాన చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ పర్యవేక్షిస్తుంటారు. ప్రస్తుతం ఈ పోస్టు ఖాళీగా ఉంది. దేవస్థాన పర్యవేక్షకులకు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పటించారు. రిటైర్డ్‌ డీఎస్పీ స్థాయి, అపై స్థాయి అధికారిని సీఎస్‌ఓగా నియమించుకునేందుకు దేవస్థానం నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటికీ ఇంతవరకు భర్తీ కాలేదు. దేవస్థానానికి ప్రత్యేకంగా చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ లేకపోవడంతో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ‘సెక్యూరిటీ’ విధుల పర్యవ్యేక్షణ గాడితప్పుతోంది. శ్రీశైల క్షేత్రంలో భద్రత కోసం 150మంది సెక్యూరిటీ గార్డులు, 50మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం, భద్రత పరంగా ఆలయంలోకి సెల్‌ఫోన్లు, పేలుడు పదార్థాలు, నిషేధిత వస్తువులను తీసుకెళ్లకుండా తనిఖీలు నిర్వహించడం, టికెట్టు కౌంటర్ల వద్ద రద్దీ క్రమబద్ధీకరించడం, దేవస్థాన భూములు, ఆస్తుల పరిరక్షణ, అసాంఘిక శక్తులు ఆలయంలోకి చొరబడకుండా అరికట్టడం వీరి ప్రధాన విధులు. వీరి పనితీరును సీఎస్‌ఓ పర్యవేక్షిస్తుంటారు. ఆలయ భద్రతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటారు.

సంవత్సరం పైగా ఖాళీగా..

గతంలో పనిచేసిన సీఎస్‌ఓ రెండు సంవత్సరాల కాల పరిమితి 2022 డిసెంబర్‌ 27వ తేదీతో పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు సంవత్సరం ఆరు నెలలుగా ఈ పోస్టు ఖాళీగా ఉంది. శ్రీశైల దేవస్థానానికి సీఎస్‌ఎ పోస్టును ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన భర్తీ చేయాలని దేవదాయశాఖ ఆదేశించింది. ఈమేరకు 2023 ఫిబ్రవరి 1వ తేదీన దేవస్థానం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కనీసం ఐదు సంవత్సరాలు డీఎస్పీ హోదాలో విధులు నిర్వహించి, పదవీ విరమణ చేసి, 65 ఏళ్ల వయస్సు కలిగిన హిందువు, దైవభక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఉచిత వసతి, వాహన సౌకర్యంతో పాటు ప్రస్తుతం అమలులో ఉన్న ప్రభుత్వ నిబంధనలను అనుసరించి వేతనం నిర్ణయిస్తామని నోటిఫికేషన్‌లో తెలిపారు. సీఎస్‌ఓ పోస్టుకు సుమారు ఎమనిది దరఖాస్తులు వచ్చాయి. వాటిలో రిటైర్డ్‌ ఆడిషనల్‌ ఎస్పీ స్థాయి అధికారిని సీఎస్‌ఓగా ఎంపిక చేశారు. అయినప్పటికీ ఇంత వరకు బాధ్యతలు చేపట్టలేదు. దీంతో క్షేత్ర భద్రత ప్రశ్నార్థకంగా మారింది.

త్వరలో భర్తీ చేస్తాం

శ్రీశైల దేవస్థాన భద్రత అత్యంత ముఖ్యమైనది. ఇందుకోసం రిటైర్డ్‌ డీఎస్పీ స్థాయి అధికారిని భద్రతాధికారిగా నియమించుకునేందుకు నోటిఫికేషన్‌ జారీ చేశాం. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో సీఎస్‌ఓ నియామకం జరిగింది. రిటైర్డ్‌ అడిషనల్‌ ఎస్పీ స్థాయి అధికారిని ఎంపిక చేశారు. వేతనం విషయంపై దేవదాయశాఖ కమిషనర్‌కు నివేదిక పంపాం. అక్కడి నుంచి అనుమతులు రాగానే సీఎస్‌ఓ పోస్టును భర్తీ చేస్తాం.– డి.పెద్దిరాజు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి