ArticlesNews

శిల్పకళా నిలయం

220views

ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో అత్యంత ప్రాశస్త్యం పొందిన ఆలయాల్లో నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం ఒకటని చెప్పవచ్చు. నందలూరు మండలం బహుదా నది తీరాన నారదమునిచే ఈ ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయం చోళుల శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తోంది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో ఆలయం విస్తరించి ఉంది. ఈ ఆలయంలో 108 స్థంభాలు ఉన్నాయి. చోళరాజులు 11వ శతాబ్దం పూర్వార్ధంలో ఆలయం నిర్మించి సౌమ్యనాథ స్వామికి 120 ఎకరాల మాన్యం ఇచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. చోళ, పాండ్య రాజులు 17వ శతాబ్దం వరకు ఆలయ నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. 12వ శతాబ్దంలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఆలయానికి గాలిగోపురం కట్టించాడు. నందలూరు, ఆడపూరు, మందరం, మన్నూ రు, హస్తవరం గ్రామాలను దానంగా ఇచ్చినట్లు శాసనాలు చెబుతున్నాయి. శ్రీ సౌమ్యనాథస్వామి వారి మూల విరాట్‌ను గమనిస్తే తిరుమలలో ఉన్న శ్రీనివాసుడు కటి హస్తంతో తన పాదాలను శరణు కోరండి.. పునీతులు కండి అని ప్రబోధిస్తుంటే, నందలూరులోని శ్రీ సౌమ్యనాథుడు తనను నమ్మి శరణు వేడితే కోరిన కోర్కెలు తీరుస్తానంటూ అభయ హస్తంతో దర్శనమిస్తాడు. కాగా నిరంత్ర అనే మహారాజు పూర్వం నిరంతపురం గ్రామాన్ని నిర్మించగా, ఆ గ్రామం బహుదానది వెల్లువలో కొట్టుకుపోగా తరువాత నలంద అనే రాజు ఈ స్థలాన్ని సందర్శించి నందలూరు అనే పేరుతో తిరిగి గ్రామాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రసిద్ధ వాగ్గేయకారుడు, పద కవితా పితామహుడు అన్నమాచార్యుడు వెంకటేశ్వరునిపై పలు శృంగార కీర్తనలు ఈ ఆలయంలో కూర్చొని రచించినట్లు ఆధారాలున్నాయి.

ఆలయ విశేషాలు..

● సౌమ్యనాథుని గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయినా మూలవిరాట్‌ ఉదయం నుంచి సాయంత్రం వరకు దేదీప్యమానంగా వెలుగొందే విధంగా ఆలయాన్ని నిర్మించడం ఒక అద్భుతం. ఆలయ నిర్మాణంలో అప్పటి శిల్పకళా నైపుణ్యం వారి కళకు అద్దం పడుతుంది. గర్భగుడి ప్రథమ ద్వారం నుంచి గర్భాలయంలోని మూలవిరాట్‌కు దాదాపు వంద గజాల దూరం ఉంటుంది. ప్రథమ ద్వారం నుంచి చూస్తే స్వామివారు దేదీప్యమానంగా వెలుగుతూ దర్శనమిస్తారు.

● ఆలయ శాసనాలను గమనిస్తే సూర్యచంద్రుల చిహ్నాలు కనిపిస్తాయి. ఆలయ కుడ్యాల పైభాగాన చేప ఆకారం కనిపిస్తుంది. బహుదానది వరదల వల్ల ఆలయంలో ఉన్న ఆ చేప ఆకారాన్ని వరద నీరు తాకితే ప్రాణంతో నీటిలో కలిసిపోతుందని భక్తుల నమ్మకం.

● ఆలయ గర్భగుడి ముందున్న కల్యాణ మండపం కొంచెం విలక్షణంగా కనిపిస్తుంది. ఈ మంటపానికి కింది భాగాన సింహం తలలు ఉన్నాయి. సాధారణంగా ఏ ఆలయానికై నా సింహాల తలలు ఆలయం పై భాగంలో ఉంటాయి. కానీ ఇక్కడ మాత్రం మంటపానికి కింది భాగంలో ఉండటం వలన ఈ ఆలయానికి కింది భాగంలో మరో ఆలయం ఉంటుందని చరిత్రకారుల నమ్మకం.

● ఆలయం లోపల విశాలమైన యాగశాల, యోగ నరసింహస్వామి, గణపతి, ఆంజనేయస్వామిలకు చెందిన చిన్నచిన్న ఆలయాలు ఉన్నాయి. దేవాలయ ప్రాంగణంలో ఒక పెద్దకోనేరు ఉంది. స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు ఇక్కడ శ్రీవారి తెప్పోత్సవం నిర్వహించడానికి అనువుగా కోనేరు నిర్మించారు.

● 16వ శతాబ్దంలో ఇక్కడికి 10 మైళ్ల దూరంలో ఉన్న పొత్తపిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన తిరువెంగనాథుని పట్టపురాణి చనేనమణి సౌమ్యనాథునికి శంఖు చక్రాలను, రత్న కిరీటాన్ని, జక్కు తిమ్మసాని రత్నాల పరాశరం, జువ్వల కమ్మలు, ఇతర స్వర్ణాభరణాలు బహుమానంగా ఇచ్చినట్లు ఆలయ శాసనాల ద్వారా తెలుస్తోంది.

● స్వామివారిని దర్శించుకొని కోర్కెలను కోరుకొని నిశ్చల భక్తితో గర్భాలయం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే వారి కోరికలు నెరవేరుతాయని నమ్మకం. కోరిక నెరవేరగానే స్వామివారిని దర్శించుకుని గర్భాలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. తిరుమల–తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న సౌమ్యనాథ ఆలయంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు.

భక్తుల కోర్కెలు తీర్చే శ్రీ సౌమ్యనాథుడు

సౌమ్యనాథ స్వామి ఆలయంలో జూలై 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు 11 రోజులపాటు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. 13వ తేదీ ఉదయం తిరుమంజనం, రాత్రి అంకురార్పణ, 14న ఉదయం ధ్వజారోహణం, రాత్రి యాలి వాహనం, 15న ఉదయం పల్లకీసేవ, రాత్రి హంస వాహనం, 16న ఉదయం పల్లకీసేవ, రాత్రి సింహ వాహనం, 17న ఉదయం పల్లకీసేవ, రాత్రి హనుమంత వాహనం, 18న ఉదయం శేషవాహనం, రాత్రి గరుడ వాహనం, 19న ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనం, 20న ఉదయం కల్యాణోత్సవం, రాత్రి గజవాహనం, 21న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 22న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణం, 23న పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.