News

ప్రధాని మోదీ కూడా అంతరిక్షంలోకి వెళ్లొచ్చు…గగన్‌యాన్‌పై ఇంటర్వ్యూలో ఇస్రో చైర్మన్‌

193views

భారత్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మానవ మిషన్‌ ‘గగన్‌యాన్‌’ కార్యరూపం దాలిస్తే ప్రధాని మోదీ కూడా అంతరిక్షంలోకి వెళ్లవచ్చని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ అన్నారు. గగన్‌యాన్‌ మిషన్‌పై ఆయన ఓ జాతీయ చానెల్‌కు సోమవారం ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ‘ప్రధాని మోదీ అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం ఉందా..?’ అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. ఆ శక్తిసామర్థ్యాలను సాధిస్తే అది మనందరికీ ఎంతో గర్వకారణమేనని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యపడదని, దానికి ఎంతో శిక్షణ అవసరమని చెప్పారు. ‘‘ప్రధాని మోదీకి కచ్చితంగా ఎన్నో కీలక బాధ్యతలు ఉంటాయి. ప్రముఖులను అంతరిక్షంలోకి పంపించడం ప్రస్తుత దశలో సాధ్యపడదు. ఎందుకంటే ఎంతో నైపుణ్యం అవసరమైన ఈ కార్యక్రమంలో భాగం కావాలంటే నెలల తరబడి శిక్షణ పొందాల్సి ఉంటుంది’’ సోమనాథ్‌ పేర్కొన్నారు. గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా ముగ్గురు వ్యోమగాములను 400 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి పంపి వారిని తిరిగి సురక్షితంగా భూమిపైకి తీసుకురావాలని ఇస్రో భావిస్తోంది. కాగా, ఈ ఏడాది ఆగస్టులో ఫాల్కన్‌–9 రాకెట్‌ ద్వారా జీశాట్‌–20 ఉపగ్రహ ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నామని సోమనాథ్‌ చెప్పారు.