News

సీఏఏ అమల్లోకి వచ్చాక తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం

312views

కేంద్ర ప్రభుత్వం ‘పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)’ అమలు ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకున్నవారికి తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా దిల్లీలో వారికి సీఏఏ కింద జారీ అయిన పౌరసత్వ సర్టిఫికెట్లను అందజేశారు.

సీఏఏ చట్టం ప్రకారం.. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరమే భారత పౌరసత్వాన్ని ఇచ్చేలా కేంద్రం చట్టం రూపొందించింది. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే ముగుస్తుంది.