అంతర్జాతీయ కుటుంబ దినోత్సవాన్ని ఏటా మే 15న విశ్వవ్యాప్తంగా జరుపుకొంటున్నాం. సమాజం సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, సమాజంలో మానవ, కుటుంబ సంబంధాలు బలహీనపడుతున్నాయి. సమాజంలో అనేక అవాంఛిత ధోరణులు ప్రబలుతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ వ్యవస్థ బలహీనపడుతున్న విషయాన్ని గుర్తించి, ఉమ్మడి కుటుంబాల ఆవశ్యకతను వివరించడం కోసం ఈ రోజును అంతర్జాతీయ కుటుంబ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు మూలం మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. కుటుంబాల్లో పెద్దల సంరక్షణలో పిల్లలు సురక్షితంగా, ఆనందంగా ఉండేవారు. కష్టసుఖాలు పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకునే బంధు మిత్రులతో ఒంటరితనం అనే భావన లేకుండా ఆనందంగా గడిపేవారు. కానీ నేడు, ఉమ్మడి కుటుంబాలనేవే లేకుండాపోయాయి. ఆధునిక ప్రపంచంలో చిన్న కుటుంబాలుగా మారాయి. నేడు ఉమ్మడిగా రెండు కుటుంబాలు కాదు కదా, రెండు మనసులు కూడా కలిసి జీవించలేని పరిస్థితి నెలకొన్నది. అందరూ డబ్బు సంపాదించే యంత్రాలుగా మారి, తల్లిదండ్రులను చూసుకొనే తీరికలేక వృద్ధాశ్రమాల్లో వేస్తున్న దుస్థితి.
ఉమ్మడి కుటుంబాల్లో వలె కలిసి మెలిసి ఉండే మనసులు కానీ, మనుషులు కానీ లేకుండా పోయారు. పెండ్లయిన వెంటనే వేరు కాపురాలు పెట్టుకొని జంటలుగా ఉండి కూడా మొబైల్ ఫోన్ పట్టుకొని ఒంటరైపోతున్నారు. సలహాలిచ్చే పెద్దవారు లేక, ఆపదలో ఆదుకునే ఆత్మీయులు రాక, బాధలను పంచుకునే బంధువులు లేక ఒంటరిగా మారుతున్నారు. చిన్న సమస్యలకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక్కడే ఉమ్మడి కుటుంబాల ప్రాధాన్యం తెలిసి వస్తున్నది. కుటుంబ వ్యవస్థతో మన సంస్కృతిని పిల్లలకు అందజేయడం, ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దడం చేయాలి. ఇదే మానవీయ సమాజ ఉన్నతికి మూలం.





