భారత్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ.. పాకిస్థాన్ వెంబడి అంతర్జాతీయ సరిహద్దు నుంచి డ్రోన్ల అక్రమ చొరబాట్లు పెరగడం కలవరం రేపుతోంది. దేశంలో లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన 60 రోజుల వ్యవధిలో సరిహద్దు భద్రతాదళం.. 49 డ్రోన్లను కూల్చివేసింది. 2022 జనవరి- మే మధ్యకాలంతో పోలిస్తే ఈ ఏడాది అదే వ్యవధిలో దాదాపు 13 రెట్లు ఎక్కువ డ్రోన్లు పొరుగు దేశం నుంచి భారత భూభాగాల్లోకి చొరబడుతూ పట్టుబడ్డాయి. వాటిలో చాలావరకు చైనాలో తయారైనవే కావడం గమనార్హం.
లోక్‌సభ పోలింగ్ తేదీల ప్రకటనతో దేశంలో మార్చి 16న ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి ఇప్పటివరకు వెలుగుచూసిన డ్రోన్లు కూలిన ఘటనల్లో అత్యధికంగా 47 పంజాబ్‌లోనే నమోదయ్యాయి. 13 లోక్‌సభ స్థానాలున్న ఈ రాష్ట్రంలో చివరివిడతలో భాగంగా జూన్ 1న పోలింగ్ నిర్వహించనున్నారు. మరో రెండు డ్రోన్లు.. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్, బికనీర్ సెక్టార్లలో పట్టుబడ్డాయి.