News

22న సింహగిరిపై వైభవంగా నృసింహ జయంతి

333views

వైశాఖ శుద్ధ చతుర్దశిని పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీన అప్పన్న ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు ఈవో సింగల శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ మేరకు మంగళవారం సింహగిరిపై అధికారులతో ఆయన సమావేశమై ఏర్పాట్లపై చర్చించారు. ఈసారి చతుర్దశి రోజున స్వామివారి ఆవిర్భావ తార స్వాతి నక్షత్రం కూడా ఉన్న నేపథ్యంలో ప్రతినెలా జరిగే స్వాతి నక్షత్ర నృసింహ హోమాన్ని ఈసారి ఆలయ కల్యాణ మండపంలో కాకుండా ఉత్తర రాజగోపురం ఎదురుగా ఉన్న కల్యాణోత్సవ ప్రాంగణంలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ హోమ పూజలో పాల్గొనాలనుకునే భక్తులు రూ.2500 రుసుము చెల్లించి పాల్గొనవచ్చని తెలిపారు. టికెట్లు సింహగిరి పీఆర్‌వో కార్యాలయంలో లభ్యమవుతాయని, www.aptemples.ap.gov.in వెబ్‌సైట్లో కూడా అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. భక్తులు ప్రత్యక్షంగా, లేదా పరోక్ష సేవలో కూడా పాల్గొనవచ్చని సూచించారు.