ArticlesNews

సనాతన ధర్మ పరిరక్షణలు, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ ఆది శంకరాచార్యులు

496views

(మే – 12 ఆది శంకరాచార్య జయంతి )

హిందూ ధర్మ పరిరక్షణకు అవతరించిన సరళ సిద్ధాంతవేత్త ఆది శంకరాచార్యులు. భరత ఖండంలో ఎన్నో కొత్త కొత్త సిద్ధాంతాలు, మతాలు పుట్టుకొచ్చి ప్రజలకి సనాతన ధర్మం పట్ల, భగవంతుని పట్ల విశ్వాసం సన్నగిల్లుతున్న సమయంలో సనాతన ధర్మ పరిరక్షణకై అవతరించిన అపర శంకరావతారమే ఆది శంకరాచార్య. జగద్గురు ఆది శంకరాచార్య విభవ నామ సంవత్సరం వైశాఖ శుద్ధ పంచమి తిథి రోజున జన్మించారు.

నంబూద్రి బ్రాహ్మణ దంపతులైన ఆర్యమాంబ, శివగురులకు కేరళలోని పూర్ణా నది ఒడ్డున ఉన్న కాలడిలో శంకరులు జన్మించారు. ఐదో సంవత్సరంలో కామ్యోపనయం చేశారు. ఏడవ సంవత్సరంలో వేదాధ్యాయనం చేసి తల్లి అనుమతితో సన్యాసాశ్రమాన్ని స్వీకరించి గోవిందభగవత్పాదాచార్యులవారి వద్ద శాస్త్రాధ్యాయనం చేశారు. ఆ తర్వాత కొంత కాలానికి గురువుగారి అనుమతితో విశ్వనాథుని దర్శనానికి మరియు వ్యాసమహర్షి దర్శనానికి కాశీ బయలుదేరారు.

శంకరాచార్యులు కాలినడకన దేశమంతా తిరిగి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు.హిందూ ధర్మ పరిరక్షణ బలహీనపడుతుండటాన్ని గమనించిన ఆయన, ఆ పరిస్థితిని చక్కదిద్దవలసిన అవసరాన్ని గుర్తించారు. ఆధ్యాత్మిక ధర్మాన్ని తిరిగి బలీయమైన శక్తిగా మలిచారు.

ధర్మసంస్థాపన చేయడానికి శంకరాచార్యులవారు దేశం నలువైపులా నాలుగు పీఠాలను స్థాపించారు. తూర్పున ఒడిశాలోని పూరీలో గోవర్థన మఠం, దక్షిణంలో కర్ణాటకలోని శృంగేరిలో శారదామఠం, పశ్చిమాన గుజరాత్‌లోని ద్వారకలో ద్వారకా మఠం, ఉత్తర దిక్కున ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌లో జ్యోతిర్మఠం స్థాపించారు.

ప్రతి హిందువు శంకరుడు అవ్వాలి. సనాతన ధర్మాన్ని తెలుసుకొని, ఆచరించి, శక్తిని సంపాదించి, స్ఫూర్తిని పొంది ధర్మం మీద జరుగుతున్న దాడిని తిప్పికొట్టాలి.