
( మే 12 – మాతృ దినోత్సవం )
అమ్మంటే ప్రేమ.. అమ్మంటే త్యాగం.. అమ్మంటే సేవ.. అమ్మంటే సహనం! ఇన్ని మహనీయ గుణాలు మూర్తీభవించిన మాతృమూర్తికి ఈ లోకంలో ఇంకెవరూ సాటిరారు. అమ్మస్థానం హిమాలయంలా మహోన్నతం. గంగానదిలా పరమపవిత్రం. మాతృత్వ స్థానంతో ఆధ్యాత్మికంగానూ మహోన్నత స్థితికి చేరుకునే అమ్మను మించిన దైవం అవనిలోనే లేదు.
మాతృత్వంలో ఉండే మాధుర్యం మాటలకు అందనిది. తండ్రి కన్నా గురువు కన్నా తల్లే గొప్పదని మన ధర్మశాస్త్రాలు నొక్కి వక్కాణించాయి. ‘గురూనాం మాతా గరీయసి’ అన్నది రుషివాక్యం. అంటే గురువుల్లో కెల్లా శ్రేష్ఠమైంది మాతృమూర్తి అన్నమాట.తల్లితో సమానమైన గురువు లేడని ఘంటాపథంగా చెబుతూ ‘నాస్తి మాతృ సమో గురుః’ అంటోంది మహాభారతం. యక్షుడు ప్రశ్నల పరంపరలో భాగంగా- ‘భూమి కన్నా ఎవరికి ఎక్కువ సహనం?’ అనడిగితే.. ‘తల్లికి’ అని బదులిచ్చాడు ధర్మరాజు. లలితా సహస్రనామ స్తోత్రం కూడా ‘శ్రీమాతా’ అనే నామంతోనే ఆరంభమవుతుంది.
దివ్యత్వానికి ప్రతీక..
అమ్మ- అనే భావనలోనే దివ్యత్వం దాగి ఉంది. అందుకే అమ్మను ఆరాధించి తరించే తాత్త్వికత మన ధర్మంలో సంప్రదాయమైంది.అలాగే ‘తైత్తిరీయోపనిషత్తు’ మాతృస్థానానికి అత్యున్నత గౌరవాన్నిస్తూ ‘మాతృదేవో భవ’ అంటూ తల్లిని దైవంతో సమానంగా పూజించమని ప్రబోధించింది. ‘దేవీ
మాహాత్మ్యం’ అమ్మవారిని స్తుతిస్తూ-
యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః
సర్వజీవుల్లో మాతృస్వరూపమై నిలిచి ఉండే దేవికి పదేపదే నమస్కారాలు- అంటూ నీరాజనాలు అర్పించింది. తను ఊపిరితో ఉన్నప్పుడే కాదు, భౌతికంగా లోకాన్ని విడిచివెళ్లినా బిడ్డలకు స్ఫూర్తిగా నిలిచే అనుబంధం మాతృమూర్తిది. పుట్టిన నేలను మాతృభూమి అని, పుట్టిన దేశాన్ని మాతృదేశమని, జన్మతః వచ్చిన భాషను మాతృభాష అంటున్నామంటే అది అమ్మ విశిష్టత.





