
235views
శివసేన (యూబీటీ) గేయం నుంచి ‘జై భవాని’, ‘హిందూ’ పదాలను తొలగించేది లేదని ఆ పార్టీ అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. ఆ పదాలను తొలగించాలంటూ ఎన్నికల కమిషన్(ఈసీ) నుంచి నోటీసు అందిందని, కానీ ఆ ఆదేశాలను పాటించబోమని స్పష్టం చేశారు. ఆ పదాలను తొలగించాలని ఆదేశించడం మహారాష్ట్రను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘తుల్జా భవానీ అమ్మవారి ఆశీస్సులతో ఛత్రపతి శివాజీ హైందవీ స్వరాజ్‌ను స్థాపించారు. అమ్మవారి పేరు మీద కానీ హిందూ మతం పేరుతో కానీ మేం ఓట్లు అడగడం లేదు. కానీ ఆ పదాలను తొలగించాలంటే సహించేది లేద’ని పేర్కొన్నారు. బహిరంగ సభల్లో తాను ‘జై భవాని’, ‘జై శివాజీ’ అని నినదించే సంప్రదాయాన్ని కొనసాగిస్తానని తెలిపారు.





