
నెస్లే ఉత్పత్తులపై ఇటీవల వచ్చిన ఆరోపణల్లో వాస్తవాలను తేల్చాలని ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ను కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ ఆదేశించింది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే, వర్ధమాన దేశాల్లో శిశువుల కోసం తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో అధిక చక్కెరను ఉపయోగిస్తోందని ఈ సంస్థపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
వీటిని పరిగణనలోకి తీసుకోవాలని FSSAIకి లేఖ రాసినట్లు సీసీపీఏ చీఫ్ నిధి ఖరే శుక్రవారం వెల్లడించారు. బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ సైతం దీనిపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి నోటీసులు జారీ చేసింది. మరోవైపు చక్కెరను గత అయిదేళ్లలో 30 శాతానికి పైగా తగ్గించామని నెస్లే ఇండియా గురువారం వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ‘ఎప్పటికప్పుడు మా ఉత్పత్తులను సమీక్షిస్తూ, రీఫార్ములేట్ చేస్తూ చక్కెర స్థాయిలను తగ్గిస్తాం. పోషకాలు, నాణ్యత, భద్రత, రుచి విషయంలో రాజీ పడకుండా చూస్తాం’ అని నెస్లే ఇండియా ప్రతినిధి వివరించారు.
ఐరోపా దేశాలతో పోలిస్తే భారత్ సహా దక్షిణాసియా దేశాలు, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లో నెస్లే విక్రయిస్తున్న బేబీ ప్రోడక్ట్స్‌లో చక్కెర శాతం అధికంగా ఉంటోందని స్విట్జర్లాండ్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ పబ్లిక్ ఐ అండ్ ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్‌వర్క్(ఐబీఎఫ్‌ఏఎన్) ఆరోపించింది. వేర్వేరు దేశాల్లో నెస్లే విక్రయిస్తున్న 150 వరకు శిశువుల ఉత్పత్తులను పరిశీలించినట్లు ఈ సంస్థ పేర్కొంది.





