ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో నేతాజీ వెంట నడిచిన ఆంధ్రులు 66 ; గుడ్ల శ్రీరాములు

265views

రెండవ ప్రపంచ యుద్ధంలో బ్రిటీష్ వారి తరపున జర్మనీతో తలపడటానికి వెళ్లిన భారతీయ దళంలో శ్రీరాములు ఒకరు. లిబియాలోని అల్లాడిన్ రంగానికి వీరి దళం వెళ్ళింది. ఆ రోజుల్లో ఇటలీ, జర్మనీ విమానాలు శత్రువులపై అగ్నివర్షం కురిపిస్తున్నాయి. పోరాటం భీకరంగా సాగుతున్నది. ఒక నాడు బాంబులు పడడానికి బదులు కరపత్రాలు కట్టలు కట్టలుగా పడ్డాయి. హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో వున్నాయా కరపత్రాలు వాటిని శ్రీరాములు దళంలో వారు తీసి చదివారు. “జర్మనీకి బ్రిటీష్ వారికీ జరుగుతున్న యుద్ధమిది. భారతీయులకు ఇందులో ఏమీ లాభం లేదు. జర్మనులు భారతీయులకు మిత్రులు. కనుక మీరు పోరాడవద్దు అని సుభాస్ చంద్రబోస్ సంతకంతో ఉన్నాయా కరపత్రాలు..

భారతీయ సైనికులలో ఆలోచనలు రేకెత్తించాయి ఆ కరపత్రాలు – మాతృదేశ స్వాతంత్ర్యం కోసం జర్మనుల వైపు వెళ్లడం మంచిదేమో అని ఆశ కల్గింది వీరికి, జర్మనులకు భారతీయులు లొంగిపోయారు. జర్మనీ చేరగానే బోసు దర్శనం అయింది. బోస్ 1942 లో అజాద్ హింద్ ఫౌజు స్థాపించబడింది. “జైహింద్” వారి నినాదం “అజాద్ రేడియో స్టేషన్” నిర్మించబడింది. వివిధ భాషలలో భారతదేశానికి సందేశాలు అందజేసేవారు బోసు, భారతీయ సైనికులందర్నీ గౌరవంగా చూసేవారు జర్మనులు, జర్మనీలో బోసుకు “నేతాజీ” అని బిరుదు వచ్చింది. సుభాస్ చంద్రబోసు కొన్నాళ్ల తర్వాత అవసరమైన పనిమీద వెళ్తున్నట్లు చెప్పారు. తర్వాత హిట్లర్ భారతీయ సైనికుల్ని సంబోధించి ప్రసంగించారు. రైస్ లాండ్ కొండమీద ఉండగా కొన్ని వందల పారాచూట్లు నుండి శత్రు సైనికులు దిగి భారతీయ సైనికుల్ని ముట్టడించారు. పెద్ద పోరాటం జరిగింది. అయితే జర్మనుల నుండి సమయానికి సహాయం రానందున భారత సైనికులు లొంగిపోవలసి వచ్చింది. ఆ సైనికుల్ని ఢిల్లీ తీసుకువచ్చి నిర్బంధించారు. 1946 మార్చిలో శ్రీరాములు, తదితరులు విడుదల చేయబడ్డారు. శ్రీరాములు హిందుస్తాన్ షిప్ యార్డులో ఉద్యోగంలో చేరారు. 1972లో స్వాతంత్య్రం యోధుల పెన్షన్ వీరికి మంజూరు చేయబడింది.