ArticlesNews

ప్రపంచ వారసత్వ దినోత్సవం

361views

(ఏప్రిల్ 18న – ప్రపంచ వారసత్వ దినోత్సవం)

ఒక సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అన్ని రంగాలు కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఇందులో వారసత్వం ( Special Story ) అనే అంశం ప్రధాన పాత్ర పోషిస్తుంది. వారసత్వం అనేది జీవి మనుగడకే కాకుండా సమాజ మనగుడకూ మైలురాయిగా నిలుస్తుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే రాజరికం వ్యవస్థ ప్రపంచ వ్యాప్తంగా వేళ్లూనుకుని ఉంది. కాలం మారుతున్న కొద్దీ ఆ వ్యవస్థలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో నాటి రాజులు కట్టించిన కట్టడాలు, నిర్మాణాలు ఆ ప్రాంతానికి విశేష ప్రాధాన్యత కలిగించాయి. ఇవే కాకుండా సహజంగా ఏర్పడిన ప్రకృతి అద్భుతాలూ ఉన్నాయి. వీటి ప్రాముఖ్యతను పరిరక్షించి తరతరాలకు అంతే భద్రంగా అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందుకే వారసత్వ కట్టడాలు, స్మారక కట్టడాలకు భద్రత చాలా అవసరం. కాబట్టి ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

చరిత్రలోని కట్టడాలు, నేటికీ సజీవంగా నిలిస్తున్న సాక్ష్యాలను పరిరక్షించుకోవడం ప్రపంచ వారసత్వ దినోత్సవ ముఖ్య లక్ష్యం. 1982లో ది ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ఐసీఓఎమ్ఓఎస్) ఏటా ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పాటించాలని ప్రతిపాదించింది. మరుసటి ఏడాది యునెస్కో జనరల్ కాన్ఫరెన్స్‌లో ఈ ప్రతిపాదనను ఆమోదించారు. అప్పటి నుంచి ఏటా ఏప్రిల్ 18న ప్రత్యేక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మానవ కార్యకలాపాలు, ప్రకృతి వైపరీత్యాలు, పట్టణీకరణ కారణంగా వారసత్వ స్మారక చిహ్నాలు, ప్రదేశాలు తరచూ ధ్వంసమవుతున్నాయి. కాబట్టి వీటి రక్షణే ధ్యేయంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

శిథిలమైపోతున్నా…
దేశవ్యాప్తంగా అద్భుతమైన ప్రాచీన కట్టడాలు, సహజ వింతలకు కొదవే లేదు. కానీ వాటిని పరిరక్షించడంలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. వైశాల్యంలో మనకన్నా చిన్నదేశమైన ఇటలీలో 59 ప్రాంతాలకు వారసత్వ హోదా దక్కింది. చైనా, జర్మనీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌ సైతం మనకన్నా ఎక్కువ కట్టడాలకు గుర్తింపు దక్కించుకున్నాయి. అందుకు అక్కడి ప్రభుత్వాల ప్రత్యేక చొరవే కారణం. మన దేశంలో ప్రాచీన కట్టడాల్లో కొన్నింటిని కేంద్ర పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) పరిరక్షిస్తోంది. మరికొన్నింటిని రాష్ట్ర పురావస్తు విభాగాలు కాపాడుతున్నాయి. ఏఎస్‌ఐ పరిధిలోని నిర్మాణాల వద్ద పర్యవేక్షణ, పరిరక్షణ చర్యలు కొంతలోకొంత నయం. రాష్ట్రాల పరిధిలోని వేలాది కట్టడాలు శిథిలమైపోతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. యునెస్కో గుర్తింపు దక్కాలంటే ముందుగా ఆ కట్టడానికి మరే ప్రాంతానికి లేని విశిష్టమైన ప్రత్యేకత ఉండాలి. కట్టడాలకు సంబంధించిన ప్రత్యేకతలను ముందుగానే సవివరమైన సాంకేతిక కొలతలు, పటాలతో తాత్కాలిక జాబితాలో పొందుపరచాలి. ఇందుకోసం ప్రత్యేకంగా కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకోవాలి. తగిన నిధులు వెచ్చిస్తేనే ఇదంతా సాధ్యమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు యునెస్కో గుర్తింపు పొందిన కట్టడం రామప్ప ఆలయం మాత్రమే. శాండ్‌బాక్స్‌ పరిజ్ఞానంతోపాటు నీటిలో తేలియాడే ఇటుకలు ఇక్కడి ప్రత్యేకతలు. దేశంలో మరుగున పడిన అనేక ప్రాచీన కట్టడాలు, సహజ వింతలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నప్పటికీ సరైన గుర్తింపు సాధించలేని పరిస్థితి నెలకొంది. ఏదైనా కట్టడానికి వారసత్వ హోదా దక్కితే ఆ ప్రాంతానికి అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుంది. ప్రపంచ వారసత్వ కమిటీ ఆయా కట్టడాలకు ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తుంది. తద్వారా ఆ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.

తెలుగు రాష్ట్రాల్లో…
మన తెలుగు రాష్ట్రాల్లోని అనేక నిర్మాణాలకు వారసత్వ భాగ్యం దక్కడం లేదు. యునెస్కో తాత్కాలిక జాబితాలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 57 కట్టడాలు ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 2022లో ఒక్క లేపాక్షి వీరభద్రస్వామి ఆలయానికి మాత్రమే అవకాశం దక్కింది. చాలా సుదీర్ఘ ప్రక్రియ అనంతరం పూర్తిస్థాయి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కన్సల్టెన్సీని ఏర్పాటు చేసుకొని, కట్టడానికి సంబంధించి సమగ్ర నివేదికను తయారు చేయాలి. ఇప్పటివరకు ఏపీ సర్కారు ఆ ప్రక్రియనే మొదలుపెట్టలేదు. జాబితాలో రెండేళ్ల క్రితం చేరినప్పటి నుంచే ప్రత్యేక దృష్టిసారించి తగినన్ని నిధులు వెచ్చించి నివేదిక సమర్పిస్తే, యునెస్కో ప్రతినిధుల క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యేది. ఈ ప్రక్రియ సకాలంలో పూర్తయితే ఈసారి దిల్లీలో జరిగే వారసత్వ కమిటీ సమావేశాల్లో లేపాక్షి ఆలయానికి కూడా గుర్తింపు దక్కే అవకాశం మెరుగయ్యేది. తెలంగాణ నుంచి తాత్కాలిక జాబితాలోకి నారాయణపేట జిల్లా కృష్ణా నదీతీరంలోని ముడుమాల్‌ నిలువు రాళ్లను చేర్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటకలో ఆరు, మహారాష్ట్రలో అయిదు యునెస్కో గుర్తింపు పొందిన కట్టడాలు, వింతలు ఉన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటివరకు ఒక్కటే ఉండటం వారసత్వ కట్టడాల పరిరక్షణలో ఉదాసీనతకు నిదర్శనం. ఈ పరిస్థితిని మెరుగుపరిచే దిశగా అధికార యంత్రాగాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి.

వైవిధ్యాన్ని కనుగొనండి- అనుభవించండి అనే నినాదాన్ని ఈ ఏడాది థీమ్ గా నిర్ణయించారు. సహజ ప్రకృతి దృశ్యాలు, చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక పద్ధతులు, సంప్రదాయాలు, ఆచారాలు, పురాతన శిధిలాలు ప్రపంచ వారసత్వంలో భాగం. వాటిని కాపాడుకోవడం ముఖ్యం. ఈ వారసత్వ ప్రదేశాలు ప్రత్యేక పర్యాటక స్థలాలుగా ఆకర్షిస్తున్నాయి. అంతే కాకుండా స్థానిక ప్రభుత్వానికి ఆర్థికంగా సహాయపడతాయి.