
ఒంటిమిట్ట రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 22న నిర్వహించే సీతారాముల కల్యాణం తిలకించడానికి తరలిరానున్న భక్తులకు పంపిణీ చేయడానికి ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో ఉన్న యాత్రికుల విడిది భవనంలో ప్రత్యేక అధికారిణి ప్రశాంతి ఆధ్వర్యంలో తొలిరోజు గురువారం 60 వేల పొట్లాలను తయారు చేయించారు. ప్రతి ప్యాకెటులో అక్షింతలు, కంకణం, ముత్యం ఉంటాయి.
సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో బుధ వారం తలంబ్రాల ప్యాకింగ్‌ను జేఈఓ వీరబ్రహ్మం పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ ముత్యాల తలంబ్రాల ప్యాకింగ్ కార్యక్రమం శ్రీవారి సేవకులతో ప్రారంభించినట్లు తెలిపారు. తలంబ్రాలకు ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్ద గల పీఏసీ వద్దకు తీసుకువచ్చారు. శ్రీ సీతారామ కల్యాణం తలంబ్రాలలో పసుపు వినియోగించేందుకు ఏప్రిల్ 13న పసుపు దంచే కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇక్కడి హాలులో బియ్యం, పసుపు, నెయ్యి కలిపి తలంబ్రాలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు సేవలందించేందుకు కర్నూలు, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి శ్రీవారి సేవకులు వచ్చినట్లు ఆయన తెలిపారు. దాదాపు 300 మంది శ్రీవారి సేవకులు 1.20 లక్షల తలంబ్రాల ప్యాకెట్లను తయారు చేస్తున్నట్లు వివరించారు.





