News

కళల విలువ యువత తెలుసుకోవాలి

298views

సమాజంలో కళలు లేకపోతే జరిగే నష్టమేంటో యువత తెలుసుకోవాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌ అన్నారు. కళలు మనిషిలో మానవత్వాన్ని పెంపొందిస్తాయని, వాటిపై ఆసక్తి లేనందువల్లే దుర్నీతి పెరిగిపోతుందని పేర్కొన్నారు. గుంటూరు శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో మంగళవారం రాత్రి సాహితీ సమాఖ్య, ఇన్‌టాక్‌, టీఎంటీ ట్రస్ట్‌ సంయుక్తంగా ‘సాహితీ వసంతోత్సవం’ పేరుతో ఉగాది వేడుక నిర్వహించాయి. గుంటూరు కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథి జస్టిస్‌ యు.దుర్గాప్రసాద్‌ మాట్లాడుతూ ‘కళల విలువ తెలియని సమాజంలో దుర్నీతి పెరిగిపోతుంది. అది ఆస్తి కోసం అన్నను చంపిన తమ్ముడి రూపంలో, వృద్ధులైన తల్లిదండ్రులను నడిరోడ్డున వదిలివెళ్లే పిల్లల రూపంలో, ముక్కుపచ్చలారని పసిపాపలను అక్రమ రవాణా చేసే కేసుల రూపంలో న్యాయస్థానాలకు చేరుతుంది. అందుకే మన పెద్దలు కళారాధన చేయాలని సూచించారు. కళల ప్రాధాన్యాన్ని గుర్తించిన సాహితీ సమాఖ్య వారు ఏటా వివిధ సాహిత్య ప్రక్రియల్లో కళాత్మకత గల కవులను, సాహితీవేత్తలను ఆహ్వానించి ఉగాది రోజున సాహితీ వసంతోత్సవం నిర్వహించడం ప్రశంసనీయమ’ని కొనియాడారు.