
తాళపత్ర గ్రంథాల్లోని విజ్ఞానాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ వేదిక్ యూనివర్సిటీని బుధవారం ఆయన సందర్శించి తాళపత్ర గ్రంథాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేల సంవత్సరాల పూర్వం మహర్షులు, రుషులు, మేధావులు అపారమైన విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక అంశాలను తాళపత్రాల్లో లిఖించారన్నారు. అటువంటి విజ్ఞానాన్ని సంరక్షించి, పరిశోధనలు చేసి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
వేదిక్ వర్సిటీలో తాళపత్ర గ్రం«థాల సంరక్షణ, డిజిటలైజేషన్ చేయడం ప్రశంసనీయమన్నారు. పురాతన న్యాయ శాస్త్ర గ్రంథాల్లో చాలా విలువైన సమాచారం ఉందని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. పురాతన నాగరికతలో న్యాయశాస్త్ర విద్యాభ్యాసం, న్యాయవ్యవస్థల సమాచారం తాళపత్రాల్లో ఉండటం విశేషమన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న తాళపత్ర గ్రంథాలను సంరక్షించి, పరిశోధనలు, ప్రచురణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
టీటీడీ ఆధ్వర్యంలో వేదిక్ వర్సిటీ నడవడం, తాళపత్ర గ్రంథాల పరిరక్షణకు పెద్దపీట వేయడం శుభపరిణామమన్నారు. అనంతరం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో కలసి ఆయన వర్సిటీలోని వేద, వేదాంగ, ఆగమ, పురాణ, ఇతిహాస, న్యాయ శాస్త్ర తాళపత్రగంథాల సంరక్షణ, డిజిటలైజేషన్ ప్రక్రియను, ప్రచురణను పరిశీలించారు. అనంతరం వర్సిటీ, టీటీడీ అధికారులు సీజే దంపతులను, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులను ఘనంగా సన్మానించారు.





