
ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని దండకారణ్య ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీపురుబట్టీ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు- మావోయిస్టుల మధ్య బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలున్నారు. ఉదయం 8గంటల సమయంలో తాల్పేర్ నది శివారులో మావోయిస్టుల సమావేశం జరుగుతోంది. భద్రతా బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారం భించాయి. ఇరువర్గాల మధ్య దాదాపు మూడు గంటలపాటు కాల్పులు కొనసా గాయి. ఈ ఘటనలో ప్లాటూన్ నంబర్-10కి చెందిన మావోయిస్టు డిప్యూటీ కమాండర్ నగేష్(40) అతని భార్య సోనీ(35), మిలీషియా డివిజనల్ అధ్యక్షుడు వికాస్(38), ఏరియా కమిటీ మహిళా సభ్యురాలు గంగీ(30), మిలీషియా సెక్షన్ కమాండర్ ముక్కా(37), మిలీషియా కమాండర్ చుక్కా(36) అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలినవారు అటవీ ప్రాంతాల మీదుగా తప్పించుకొని పోయినట్లు పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఘటనా స్థలంలో మావోయిస్టులకు చెందిన తుపాకులు, పేలుడు పదార్థాలను భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనను బీజాపూర్ ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ ధ్రువీకరించారు





