News

సత్యదేవునికి బంగారు ధ్వజస్తంభం

279views

అన్నవరం రత్నగిరిపై కొలువైన శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామివారి ఆలయంలో నూతన బంగారు ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు గాను ప్రస్తుతం ఉన్న ధ్వజస్తంభం తొలగింపు పనులకు గురువారం శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో ఉదయం 8.08 గంటలకు ధ్వజ స్తంభం కళాప్రకర్షణ కార్యక్రమాన్ని పండితులు నిర్వహించారు. ప్రస్తుత ధ్వజస్తంభం కలశలను ఉపసంహరించి భద్రపరుస్తారు. అనంతరం ఆ కర్రను తొలగించే పని ప్రారంభమవుంది. రెండు, మూడు రోజుల్లో పనులు పూర్తవుతాయి.

ఏప్రిల్‌ 22న నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ
ఏప్రిల్‌ 18వ తేదీ నుంచి నూతన ధ్వజ స్తంభం ప్రతిష్ఠ కార్యక్రమాలు మొదలవుతాయి. 22వ తేదీ ఉదయం శాస్త్రోక్తంగా నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుంది. సత్యదేవుని ఆలయంలో సుమారు 50 ఏళ్ల క్రితం ప్రతిష్ఠించిన ధ్వజస్థంభం కర్ర పుచ్చిపోయి శిథిలావస్థకు చేరింది. ఈ విషయాన్ని గమనించిన దేవస్థానం వైదిక కమిటీ నూతనంగా ప్రతిష్ఠించాలని గత ఏడాది ఆగస్టులో అప్పటి ఈఓ ఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌ అజాద్‌కు నివేదిక సమర్పించింది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రూ.నాలుగు కోట్ల వ్యయం
నెల్లూరుకు చెందిన ఒక దాత రూ.నాలుగు కోట్లతో నూతన ధ్వజస్తంభం ఏర్పాటు, దానిపై బంగారు రేకు తాపడం చేసేందుకు ముందుకు వచ్చారు. బంగారు రేకు తాపడానికి సుమారు మూడు కేజీలు బంగారం అవసరమని అంచనా వేశారు. రాగి రేకు తయారు చేసి దానిపై బంగారు పూత పూస్తారు. బంగారు రేకు తయారీ పనులు కూడా చురుకుగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.

అన్నవరం చేరిన నారప కర్ర
నూతన ధ్వజస్తంభానికి అవసరమయ్యే నారప జాతికి చెందిన 64 అడుగుల కర్రను గుంటూరు జిల్లా తెనాలిలోని టింబర్‌ డిపోలో గత అక్టోబర్‌లో అప్పటి దేవస్థానం ఈఓ చంద్రశేఖర్‌ అజాద్‌, నెల్లూరుకు చెందిన దాత, దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, ప్రస్తుత డిఫ్యూటీ ఈఓ రమేష్‌ బాబు, విశ్రాంతి స్ధపతి ప్రసాద్‌ ఎంపిక చేశారు. దానిని ధ్వజస్తంభం రూపంలో తయారు చేసి, దేవస్థానంలోని పంపా సత్రానికి తరలించారు. కాగా.. ధ్వజస్తంభం కళాప్రకర్షణ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ కె.రామచంద్రమోహన్‌, వేదపండితులు, ఇతర సిబ్బంది పాల్గొంటారని అధికారులు తెలిపారు.