
శ్రీశైల శిఖరేశ్వరం వద్ద శనివారం ఉదయం ఇష్టకామేశ్వరి దర్శనానికి వెళ్లాల్సిన భక్తులు ఆందోళన చేపట్టారు. అటవీ అధికారులు, స్థానిక చెంచుగిరిజనుల మధ్య తలెత్తిన వివాదాల కారణంగా ఇష్టకామేశ్వరి దర్శనానికి శనివారం కొంత సేపు బ్రేక్ పడింది. దీంతో ముందుగానే టికెట్లు తీసుకున్నా అనుమతించకపోవడంతో వారు పెద్ద ఎత్తున రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో కిలో మీటర్ల మేర వాహనాల రాకపోకలు స్తంభించాయి. అమ్మవారి దర్శనానికి ఒక్కొక్క భక్తుడు నుంచి అటవీ అధికారులు రూ.1000 వసూలు చేస్తారు. ఇందులో సగం అటవీ శాఖకు, మిగతా సగంలో భక్తులను తరలించే వాహన యజమానికి, కొంత స్థానిక చెంచు గూడేలా అభివృద్ధికి కేటాయించారు.
కాగా చెంచు గూడేలా అభివృద్ధికి కేటాయించే మొత్తాన్ని కొంత పెంచి, సకాంలో అందజేసి గూడేంలను అభివృద్ధి చేయాలని చెంచులు ఇష్టకామేశ్వరి ఆలయానికి వచ్చే వాహనాలను అడ్డుకున్నారు. దీంతో టికెట్లు తీసుకున్న భక్తులు ఏమి చేయాలో తెలియక రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. చెంచుగిరిజనులకు న్యాయం చేస్తామని నిక్కంటి ఫారెస్ట్ రేంజర్ ఆరీఫ్‌ఖాన్ హామీ ఇవ్వడంతో చెంచులు ఆందోళన విరమించారు. అనంతరం భక్తులను ఇష్టకామేశ్వరి దర్శనానికి అనుమతించారు. కాగా మరో ఐదు రోజుల పాటు ఇష్టకామేశ్వరి అమ్మవారి దర్శనా నికి అనుమతి నిలిపివేస్తున్నట్లు మార్కాపురం డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విగ్నేష్ అప్పావ్ తెలిపారు.





