News

సత్యదేవుని సన్నిధిలో కానరాని ఉపశమన చర్యలు

347views

ప్రస్తుతం శిశిర రుతువు. ఫాల్గుణ మాసం సగం రోజులైంది. తర్వాత రెండు మాసాలు వసంతం.. ఆపై ఎండలు మండిపోయే గ్రీష్మం ప్రారంభమవుతుంది. కానీ, ఇప్పుడే గ్రీష్మ రుతువు వచ్చేసిందా అన్నట్టుగా అన్నవరం కొండ అగ్నిగుండాన్ని తలపిస్తోంది. ప్రస్తుతం 32 డిగ్రీలకు కాస్త అటూ ఇటుగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా.. ఇటీవలి వర్షాలకు గాలిలో తేమ శాతం పెరగడంతో తీవ్రమైన ఉక్కపోత వాతావరణం నెలకొంది. ఉదయం పది గంటలు దాటితే చాలు.. తాళలేని స్థాయిలో ఎండ తీవ్రత పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో భక్తవరదుడైన అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు ఆపసోపాలు పడుతున్నారు. తమ కష్టాలు తీర్చాలని స్వామిని కోరుకునేందుకు కొండకు వస్తే.. ఇక్కడ కొండంత కొత్త సమస్య ఎదురవడంతో నానా ఇబ్బందులూ పడుతున్నారు. ‘స్వామీ.. నీ దయ రాదా’ అంటూ తమ కష్టాలతో పాటు కొండపై ఎండ బాధలు కూడా తప్పించాలంటూ సత్యదేవుని ప్రార్థిస్తున్నారు. ఈ సమస్య నుంచి తమకు విముక్తి కలిగించాలని అటు ఆలయ అధికారులను కూడా వేడుకుంటున్నారు.

ఇవీ సమస్యలు
● ఆలయ ప్రాకారంలో భక్తులకు నీడనిచ్చేందుకు గతంలో గ్రీన్‌ షేడ్‌ నెట్‌ అమర్చారు. ఇది సుమారు 12 అడుగుల ఎత్తులో ఉండేది. దీనివలన భక్తులకు ఎండ నుంచి కాస్త ఉపశమనం లభించేది. అయితే స్వామివారి రథ సేవ కోసం ఇటీవల చిన్న టేకు రథం చేయించారు. ఈ రథం కలశం గ్రీన్‌ షేడ్‌ నెట్‌కు తగులుతూండటంతో రథ సేవ సజావుగా జరిగేందుకు వీలుగా దానిని సుమారు నెల రోజుల కిందట తొలగించారు. గ్రీన్‌ షేడ్‌ స్తంభాలను మరింత ఎత్తు చేసి, మళ్లీ గ్రీన్‌ షేడ్‌ నెట్‌ వేయాలని ఆ సందర్భంగా ఈఓ ఆదేశించారు. రోజులు గడుస్తున్నా ఇప్పటికీ ఆ పని పూర్తి చేయలేదు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు.

● రత్నగిరిపై సత్యదేవుని ఆలయ ప్రాంగణమంతా రాళ్లు పరచి ఉంటుంది. కాస్తంత ఎండ కాస్తే చాలు.. ఈ రాళ్లు వేడెక్కిపోతున్నాయి. వాటిపై నడిచే భక్తులు కాళ్లు బొబ్బలెక్కిపోతున్నాయంటూ గగ్గోలు పెడుతున్నారు. ఆలయ ప్రాకారంలో నిత్య కల్యాణ మండపం వైపు కొంత మేర కాళ్లు కాలకుండా కార్పెట్‌ వేశారు. రెండోవైపు వ్రత మండపాలు ఉన్నచోట అది కూడా లేదు. దీంతో భక్తులు ఆ ప్రాకారంలో నడవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.

● దేవస్థానంలో కొన్నిచోట్ల భక్తుల కోసం షామియానాలు వేయించారు. చలువ పందిళ్లు వేసే కార్యక్రమం ఇప్పుడే మొదలైంది. ఇంకో వారం రోజులకు గానీ ఇవి పూర్తయ్యే పరిస్థితి లేదు. ఆలయ ప్రాకారంలో ప్రతి భక్తుడూ తప్పనిసరిగా నడవాల్సిన పరిస్థితి. వెంటనే ఈ ప్రాకారంలో గ్రీన్‌ షేడ్‌ వేయించాలని భక్తులు కోరుతున్నారు.

మజ్జిగ పంపిణీ ఎప్పుడో!
ఏటా వేసవి ప్రారంభంలో మార్చి నెల నుంచే భక్తుల కోసం దేవస్థానం మజ్జిగ పంపిణీని ప్రారంభించేది. పశ్చిమ రాజగోపురం ఎదురుగా, రామాలయం ఎదురుగా ఉన్న సర్క్యులర్‌ మండపంలో మజ్జిగ పంపిణీ చేసేవారు. కరివేపాకు, అల్లం కలిపిన మజ్జిగ తాగి భక్తులు ఉష్ణతాపం నుంచి సేద తీరేవారు. గత ఏడాది మార్చి 19వ తేదీ నుంచి మజ్జిగ పంపిణీ ప్రారంభించారు. ఈ ఏడాది మార్చి 23వ తేదీ వచ్చేసినా ఇంతవరకూ ఆ ఊసే మరిచారు. వెంటనే మజ్జిగ పంపిణీ ప్రారంభించాలని భక్తులు కోరుతున్నారు.