News

కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంత్యుత్సవాలు రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం

706views

కర్ణాటకలో అధికార చేపట్టగానే బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.  మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను రద్దు చేయాలని నిర్ణయించారు. తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ మేరకు కర్ణాటక భాషా, సాంస్కృతిక మంత్రిత్వశాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది నుంచి టిప్పు సుల్తాన్ జయంత్యుత్సవాలను నిర్వహించకూడదని విస్పష్ట ఆదేశాలు ఇచ్చారు. యడియూరప్ప తీసుకున్న ఈ నిర్ణయం సాహసోపేతమైనది భారతీయ జనతాపార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తుండగా, కాంగ్రెస్ మాత్రం యదావిధిగా ఇది మైనారిటీల మనోభావాలను దెబ్బతీసే చర్యగా అభివర్ణిస్తోంది.

సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కర్ణాటకలో ప్రభుత్వమే అధికారికంగా టిప్పుసుల్తాన్ జయంత్యుత్సవాలు జరుపుతోంది. కాంగ్రెస్ – జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వంలో కూడా అదే ఒరవడి కొనసాగింది.   గత ఏడాది కూడా నవంబర్ 10వ తేదీన టిప్పు జయంతిని ప్రభుత్వం అధికారికంగా చేపట్టిన విషయం తెలిసిందే.

కాగా  టిప్పు జయంతిని అధికారికంగా నిర్వహించడాన్ని కర్ణాటకలో హిందూ సంస్థలు, బీజేపీ నాయకులు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. మైసూరును పరిపాలించిన వడయార్ రాజవంశీయులపై దండెత్తిన టిప్పు సుల్తాన్ జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించడమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా హిందువుల పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన టిప్పు సుల్తాన్ ని చరిత్రలో సాహసిగా, జన రంజక పాలకుడిగా చిత్రీకరించే ప్రయత్నం కుహనా మేథావులు   చేశారని, నేడు కాంగ్రస్ కూడా అదే దుస్సాంప్రదాయాన్నికొనసాగిస్తున్నదని హిందూ సంస్థలు, బీజేపీ నాయకులు అనేకసార్లు ఆరోపించారు. దానికి చారిత్రిక ఆధారాలను కూడా చూపే ప్రయత్నం చేశారు.  ఈ ఉత్సవాలను వెంటనే రద్దు చేయాలంటూ బీజేపీ నాయకులు డిమాండ్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీనికోసం వారు ఆందోళనలను కూడా చేపట్టిన రోజులు ఉన్నాయి. కానీ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆందోళనలనన్నిటినీ ప్రక్కన పెట్టి మొండిగా టిప్పు సుల్తాన్ జయంత్యుత్సవాలు జరిపింది. ఎట్టకేలకు  బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతో టిప్పు జయంత్యుత్సవాలకు తెర పడింది.

అయితే బీజేపీ ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ మాత్రం  తనకు సహజమైన మైనారిటీ బుజ్జగింపు వాదాన్ని వినిపిస్తూ, హిందూ వ్యతిరేక వాణిని వినిపిస్తోంది.