
ఉగ్రవాద నిర్మూలపై పాకిస్థాన్ మాటలు చెప్పకుండా చేతల్లో చూపించాలని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిశ్ కుమార్ డిమాండ్ చేశారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పీకేయాలని ఆయన కోరారు. ఇందుకోసం చిత్తశుద్దితో పనిచేసినప్పుడే సాధ్యమవుతుందని ఆయన హితవు పలికారు.అయితే భారత దేశం మాత్రం పాక్ ప్రధాని ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని చేసిన వ్యాఖ్యలను హృదయపూర్వకంగా చేసినవిగా చూడడం లేదని అన్నారు.
పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ని కలిసిన నేపథ్యంలో ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అమెరికాకు వివరించారు. ఈనేపథ్యంలోనే ఇమ్రాన్ ఖాన్ మొదటిసారిగా తమ దేశంలో 40 వేల మంది ఉగ్రవాదులు ఉన్నారని స్వయంగా ప్రకటించి సంచలనం రేపారు. ఈనేపథ్యంలో ఉగ్రవాద నిర్మూలనకై తాము చిత్తశుద్దితో కృషి చేస్తున్నామని తెలిపారు.
ఇమ్రాన్ ఖాన్ మొదటి సారి పాకిస్థాన్‌లో ఉగ్రవాదులతో పాటు వారి స్థావరాలు కూడ ఉన్నట్టు ఒప్పుకున్నారని ,అయితే పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించాలని రావిశ్ కుమార్ అన్నారు. ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు మొదటి సారి కాదని, ఇలాంటీ వ్యాఖ్యలు పాకిస్థాన్ చాలసార్లే చేసిందని తెలిపారు. అవి చేతల్లో చూపినపుడే ఆ మాటలపై నమ్మకం కుడురుతుందన్నారు.





