
విశాఖకు కొత్తగా రెండు వందేభారత్ రైళ్లు రానున్నాయి. సికింద్రాబాద్-విశాఖ-సికింద్రాబాద్, పూరీ-విశాఖ-పూరీ రైళ్లను ఈ నెల 12న ప్రధానమంత్రి మోదీ వర్చువల్‌గా ప్రారంభించే అవకాశం ఉందని వాల్తేరు రైల్వే అధికారులు భావిస్తున్నారు. సికింద్రాబాద్-విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ రైలు వారంలో ఆరు రోజులపాటు నడుస్తుందని, టికెట్ ధరలు ఇప్పుడు నడుస్తున్న విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ రైలు తరహాలోనే ఉంటాయని చెబుతున్నారు.
పూరీ-విశాఖ(20841) వందేభారత్ రైలు శనివారం మినహా ప్రతి రోజు ఉదయం 5.15గంటలకు పూరీలో బయలుదేరి 11.30గంటలకు విశాఖ వస్తుంది. తిరుగు ప్రయాణంలో విశాఖ-పూరీ(20842) రైలు శనివారం మినహా ప్రతి రోజు మధ్యాహ్నం 3.40గంటలకు విశాఖలో బయలుదేరి రాత్రి 9.55 గంటలకు పూరీ చేరుకుంటుంది. ఈ రైలు ఖుర్ధారోడ్, బ్రహ్మపుర, పలాస, శ్రీకాకుళం, విజయనగరం స్టేషన్లలో నిలుస్తుందని వాల్తేరు రైల్వే అధికారులు పేర్కొన్నారు.





