News

సోదర భావంతోనే సమానత్వం

441views

దేశంలో సమానత్వానికి పరస్పర సోదర భావం అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. ప్రజలు పరస్పరం ఘర్షణ పడుతుంటే దేశం ఎలా ముందుకు సాగుతుందని ప్రశ్నించారు. రాజస్థాన్‌లోని బికనేర్‌లో శనివారం జరిగిన ‘హమారా సంవిధాన్‌ హమారా సమ్మాన్‌’ సదస్సులో ఆయన మాట్లాడారు. ‘రాజ్యాంగ స్ఫూర్తితో ఒకరినొకరు గౌరవించుకోవాలి. పౌరుల గౌరవం అనేది రాజ్యాంగ నిర్మాతల మదిలో అత్యంత ముఖ్యమైన అంశంగా ఉండేది. రాజ్యాంగ డ్రాఫ్టింగ్‌ కమిటీ ఛైర్మన్‌గా బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌.. న్యాయ వ్యవస్థలో విలువలు, స్వేచ్ఛ, సమానత్వం, సుహృద్భావ స్ఫూర్తి, పౌరుల గౌరవం వంటి అంశాలకు రాజ్యాంగం ద్వారా హామీ ఇచ్చారు. పరస్పర సోదర భావం అనేది సమానత్వాన్ని కాపాడటానికి ఉపయోగపడుతుంది. ప్రజలందరూ సుహృద్భావాన్ని, సోదరతత్వాన్ని ప్రోత్సహించాలి. తమ వ్యక్తిగత జీవితంలో ఇటువంటి భావనలను స్వీకరించాలి’ అని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పేర్కొన్నారు.

రాజ్యాంగం న్యాయవాదులకు స్వర్గం కాదు

భారత రాజ్యాంగం న్యాయవాదులకు స్వర్గం కాదని సీజేఐ స్పష్టం చేశారు. అది కొద్ది మంది న్యాయవాదులు సృష్టించినది కాదని పేర్కొన్నారు. పలు సామాజిక, రాజకీయ ఉద్యమాల స్ఫూర్తితోనే రాజ్యాంగాన్ని రూపొందించారని వెల్లడించారు.