
భారత్‌తో దౌత్యపరమైన వివాదం వేళ.. మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఆ దేశ పర్యాటక ర్యాంకింగ్‌లో మన దేశం ఆరో స్థానానికి చేరుకుంది. అక్కడి ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. గతేడాది డిసెంబరు 31 వరకు భారత్ నుంచి 2,09,198 మంది మాల్దీవులను సందర్శించారు. నాడు ద్వీపదేశ పర్యాటక మార్కెట్‌లో 11శాతం వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రష్యా రెండో స్థానంలో.. చైనా మూడో స్థానంలో కొనసాగాయి. నాలుగో స్థానంలో బ్రిటన్ నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్‌ను సందర్శించిన ప్రధాని మోదీ.. సాహసాలు చేయాలనుకున్నవారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. తర్వాత కూడా ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు డ్రాగన్‌కు దగ్గరవుతూ, భారత్‌పై నోరు పారేసుకుంటున్నారు. ఈ వివాదంతో మాల్దీవులకు వెళ్లే మన పర్యాటకుల సంఖ్య పడిపోతోంది. జనవరి ప్రారంభంలో మోదీ పర్యటన తర్వాత.. మూడు వారాల్లో (జనవరి 21) అగ్రస్థానంలో ఉన్న భారత్ ఐదో స్థానానికి దిగొచ్చింది. 28 వేల మంది పర్యాటకులతో(6.3శాతం) మార్చి 3 నాటికి ఆరో స్థానానికి పడిపోయింది.
భారత ప్రజలారా క్షమించండి: మహమ్మద్ నషీద్
భారత్‌తో వివాదం తమపై ఎంతో ప్రభావం చూపిందని, మరీ ముఖ్యంగా పర్యాటక రంగాన్ని దెబ్బతీసిందని మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ అన్నారు. తమ దేశ ప్రజల తరఫున భారత్‌కు క్షమాపణలు తెలియజేశారు. భారత్‌లో పర్యటించిన సందర్భంగా ఆయన స్పందించారు. ‘‘ఈ సెలవులకు భారతీయులు మా దేశం రావాలని కోరుకుంటున్నాం. ఎప్పటిలాగే మా ఆతిథ్యం ఉంటుంది. దానిలో ఎలాంటి మార్పు ఉండదు’’ అని నషీద్ మీడియా వేదికగా తెలిపారు.





