
కర్ణాటక విధాన సౌధ వద్ద కొందరు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేయడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రాజ్యసభ ఎంపీగా నాసిర్ హుస్సేన్ విజయం సాధించిన అనంతరం ఆయన అనుచరులు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారని వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ముగ్గురు నిందితుల్లో ఒకరు బెంగళూరులోని ఆర్‌టీ నగర్‌కు చెందిన వ్యక్తి కాగా.. మరొకరు హవేరి జిల్లా, మూడో వ్యక్తి ఢిల్లీకి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. వీరిలో హవేరికి చెందిన వ్యక్తి.. మిర్చీ వ్యాపారి అని సమాచారం. అయితే, ఫోరెన్సిక్ నివేదికను ప్రైవేటు వ్యక్తి రూపొందించడం, అది బహిర్గతం కావడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై రాష్ట్ర హోంమంత్రి జి.పరమేశ్వర్ స్పందిస్తూ.. ఎవరి అనుమతితో దాన్ని బహిర్గతం చేశారనే విషయంపై ఆరా తీస్తామన్నారు.
సంబంధిత నినాదాలు చేసినవారిని తక్షణమే అరెస్టు చేయాలని అంతకుముందు విపక్ష బిజేపి పట్టుబట్టింది. ఈ పరిణామాలపై ఇటీవల స్పందించిన సీఎం సిద్ధరామయ్య.. అవి నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కేసులో ఫోరెన్సిక్ అధికారుల నుంచి నివేదిక ఆధారంగానే చర్యలు ఉంటాయని హోంమంత్రి పరమేశ్వర్ వెల్లడించారు.





