ArticlesNews

‘అదిగో ద్వారక, ఆలమందలవిగో…!’

346views

ఇటీవల గుజరాత్‌లోని ద్వారక పట్టణంలో కొత్తగా నిర్మాణమైన వివిధ మౌలిక సదుపాయాలను ప్రారంభించడానికి వెళ్లిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అక్కడి పంచకుయ్ బీచ్ తీరంలో స్కూబా డైవింగ్ చేశారు. సాగర గర్భంలో ఉన్న శ్రీకృష్ణుడి కర్మభూమి (ల్యాండ్ ఆఫ్ యాక్షన్) అయిన పురాతన ద్వారకను సందర్శించి ప్రార్థనలు చేశారు. ‘సముద్రంలో మునిగి ఉన్న ద్వారకా నగరంలో ప్రార్థన చేయడం దివ్యానుభూతిని కలిగించింది. మహోన్నత ఆధ్యాత్మిక వైభవం, భక్తితో కూడిన పురాతనయుగానికి అనుసంధానితమయ్యాను. భగవాన్ శ్రీకృష్ణుడు మనందరినీ ఆశీర్వదిస్తాడు’ అని సోషల్‌ మీడియా పోస్ట్‌లో ఆయన పేర్కొన్నారు. అదేరోజు ద్వారక పట్టణంలో బహిరంగసభలో మాట్లాడుతూ ‘నేను సముద్రంలోకి వెళ్లి పురాతన ద్వారకను చూశాను. సముద్రంలో మునిగిపోయిన ద్వారక గురించి పురావస్తు శాస్త్రవేత్తలు చాలా రాశారు. మన గ్రంథాలలో కూడా ద్వారక గురించి చాలా చెప్పబడింది. పురాతన ద్వారక ఒక గొప్ప నగరం. ప్రణాళిక, అభివృద్ధికి మంచి ఉదాహరణ. నేను అక్కడ శ్రీకృష్ణునికి నమస్కరించాను. నాతో నెమలి ఈకలు తీసుకువెళ్లి సమర్పించాను’ అని నరేంద్ర మోదీ అన్నారు.

శ్రీకృష్ణుడు, మహాభారతంతో ముడివడివున్న ద్వారకకు హిందూ సంస్కృతిలో ఒక సమున్నత ప్రాధాన్యమున్నది. హిందూ ధర్మ ఏడు పవిత్ర ప్రదేశాలలో ఆ నగరం కూడా ఒకటి. మిగతావి: అయోధ్య, మథుర, హరిద్వార్, కాశీ, కంచి, ఉజ్జయిని. మేనమామ కంసుడిని సంహరించిన తరువాత కృష్ణుడు తన యాదవ తెగ ప్రజలతో సహా ద్వారకకు వెళ్లి, సముద్రం నుంచి 12 యోజనాల భూమిని పునఃసంపాదించుకుని తన రాజ్యాన్ని వ్యవస్థాపించాడని పురాణాలు చెబుతున్నాయి. విశాల ఉద్యానవనాలు, తటాకాలు, సరస్సులు, అందమైన సౌధాలతో ద్వారక వర్థిల్లుతున్నదని విష్ణు పురాణం పేర్కొంది. అయితే కృష్ణుడి మరణానంతరం అది సముద్రంలో మునిగిపోయింది. ఇప్పటి ద్వారక కచ్ సింధుశాఖ అరేబియా సముద్రంలో కలుస్తున్న చోట ఉన్నది. కృష్ణ యాత్రా స్థలాలలో అది కూడా ఒకటి. మిగతావి, బృందావన్, మథుర, గోవర్ధన్, కురుక్షేత్ర, పూరి. కృష్ణుడికి అంకితం చేస్తూ నిర్మించిన పురాతన ద్వారకాధీశ్ ఆలయం నేటి ద్వారకలో ఉన్నది. శ్రీకృష్ణుడి మునిమనవడు వజ్రనాభుడు 2500 సంవత్సరాల క్రితం నిర్మించినట్టుగా చెబుతున్న ఈ ఆలయం కాలం పొడుగునా పలుమార్లు పునర్నవీకరింపబడింది. ముఖ్యంగా 16వ, 19వ శతాబ్దాలలో జరిగిన మార్పులు ఆ ఆలయంపై చెరగని ముద్రలు వేశాయి అని గుజరాత్ పర్యాటక శాఖ వెబ్‌సైట్ పేర్కొంది.

మహాభారతంలో ప్రస్తావితమైన ద్వారకా నగర నెలవును కచ్చితంగా గుర్తించేందుకు 20వ శతాబ్ది ఆరంభం నుంచి చరిత్రకారులు, పండితులు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ ప్రాచీన సాహిత్య గ్రంథాల ఆధారంగా జరిగాయి. ప్రస్తుతమున్న ద్వారకే శ్రీకృష్ణుడి ద్వారకా, లేక సముద్ర గర్భంలో ఉన్నదే ఆయన ద్వారకా? లేదా చారిత్రక వాస్తవికతను ఎప్పటికీ ధ్రువీకరించలేని ఒక పౌరాణిక నగరమేనా? బ్రిటిష్ సివిల్ సర్వెంట్, కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి, హిందూ ధర్మ అధ్యయనవేత్త ఎఫ్ఇ పర్గిటర్ 1904లో మార్కండేయ పురాణానికి చేసిన అనువాదంలో మహాభారతంలో ప్రస్తావితమైన ద్వారక నెలవు రైవత పర్వతాలపై ఉన్నదని ప్రప్రథమంగా పేర్కొన్నారు. ప్రస్తుత ద్వారకకు 200 కిలోమీటర్ల దూరంలో జునాగఢ్‌లో ఉన్న గిర్నార్ పర్వతాలే రైవత పర్వతాలని పండితుల అభిప్రాయం. ప్రస్తుత ద్వారక క్రీ.పూ. 1200 సంవత్సరానికి పూర్వపుది కాకపోవచ్చని అనంత్ సదాశివ్ అల్టేకర్ అనే పండితుడు భావించారు. అయితే ప్రాచీన గ్రంథాల్లో ప్రస్తావితమైన ద్వారక సముద్రంలో మునిగిపోయిందనే విషయాన్ని ఆయన అంగీకరించారు. ఎ.డి పుల్సాకర్ అనే మరో పండితుడు 1943లో ‘కృష్ణుడి చరిత్రాత్మకత’ అన్న తన వ్యాసంలో ప్రస్తుత ద్వారక మహాభారతంలో ప్రస్తావితమైన ద్వారకే అని విశ్వసించారు. 1960ల్లో పురావస్తు శాస్త్రవేత్త హెచ్‌డి సంఖాలియా సైతం ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ద్వారక అన్వేషణ 1960వ దశకంలో కొత్త మలుపు తిరిగింది. ప్రాచీన గ్రంథాల ఆధారంగా కాకుండా పురావస్తు పరిశోధనల ప్రాతిపదికన కృష్ణుడి ద్వారకను గుర్తించే ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. నిజానికి ఈ ప్రయత్నాలు 1930ల్లోనే హీరానంద్ శాస్త్రి అనే పురావస్తు శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ప్రస్తుత ద్వారక పరిసర ప్రాంతాల్లో పురావస్తు తవ్వకాలు జరిగాయి. అదే సమయంలో సముద్రంలో మునిగిపోయిన ద్వారకపైనా ఊహాగానాలు ఒక నిర్దిష్టతకు చేరుకున్నాయి. దీంతో సముద్రంలో ఆ నగర అవశేషాలను కనుగొనే ప్రయత్నాలూ ప్రారంభమయ్యాయి.

తొలి పురావస్తు తవ్వకాలు 1963లో ద్వారకాధీశ్ ఆలయం పరిసర ప్రాంతాలలో జరిగాయి. ఆ ప్రాంతాల్లో కిక్కిరిసిన జనావాసాలు ఉండడంతో ఆ తవ్వకాలు విస్తృతస్థాయిలో జరగలేదు. గత 2000 సంవత్సరాలుగానే ఆ ప్రాంతాల్లో జనావాసాలు వర్థిల్లుతున్నాయని ఆ తవ్వకాలు నిర్ధారించాయి. 1979లో ఎస్ఆర్ రావు నేతృత్వంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారకాధీశ్ ఆలయ పరిసరాలలో మరోసారి తవ్వకాలు ఆరంభించింది. ఈ తవ్వకాలపై అధికారిక నివేదిక ప్రచురితం కాలేదు. అయితే ఆ నివేదిక ఆధారంగా ద్వారకాధీశ్ ఆలయ పరిసరాలలో క్రీస్తుపూర్వం రెండో సహస్రాబ్దానికి చెందిన మృణ్మయ పాత్రలు, మూడు ఆలయాలు బయటపడినట్టు ఎఎస్ఐ డైరెక్టర్ జనరల్ వెల్లడించారు. ఈ పరిశోధనలు సముద్ర గర్భిత పురాతన నగరంపై ఆసక్తిని మరింత పెంపొందించింది. ఫలితంగా గోవాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ’ (ఎన్ఐఓ)కు చెందిన మెరైన్ ఆర్కియాలజిస్టులు అరేబియాసముద్రంలో మునిగిపోయిన ప్రాచీన నగరాన్ని కనుగొనేందుకు ప్రయత్నాలు ఆరంభించారు. 1988 నుంచి ఈ పరిశోధకుల బృందంలో ఉన్న వారిలో డాక్టర్ శీల త్రిపాఠి ఒకరు. సముద్ర గర్భంలో తమకు లభ్యమైన వస్తువులను, ద్వారకకు 30 కిలోమీటర్ల పరిధిలో నిర్వహించిన పురావస్తు తవ్వకాలలో బయల్పడిన వస్తువులతో పోల్చిచూస్తే అవి హరప్పన్ నాగరికతా యుగం మలి దశకు (క్రీస్తుపూర్వం 1900 నుంచి 1300 సంవత్సరం వరకు) చెందినవిగా నిర్థారణ అయిందని త్రిపాఠి తెలిపారు. విశేషమేమిటంటే హరప్పా నాగరికత మలి దశ మహాభారత కాలం నాటిదే అన్న వాస్తవాన్ని అనేకమంది విద్వాంసులు అంగీకరిస్తున్నారు. ప్రస్తుత ద్వారక పరిసర ప్రాంతాలలో లభ్యమైన వస్తువులు, సముద్రగర్భ నగర అవశేషాలలో లభ్యమైన వస్తువులు కార్బన్ డేటింగ్ మొదలైన వైజ్ఞానిక పరీక్షలలో ఒకే కాలానికి చెందినవని రుజువు కావడంతో సముద్రంలో మునిగిపోయిన నగరం కృష్ణుడి ద్వారకే అన్న వాదనకు, దాని చారిత్రిక వాస్తవికతకు బలం చేకూరింది. దీనిని మరింతగా దృఢపరిచేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి. 1983–-90 సంవత్సరాల మధ్య జరిగిన తవ్వకాల్లో ఒక కోట పునాదులు, స్తంభాలు నీటిపారుదల సదుపాయాలు మొదలైనవి బయల్పడ్డాయి.

ప్రస్తుతమున్న ద్వారకకుగానీ, సముద్రంలో మునిగిన ద్వారకకుగానీ కృష్ణుడి రాజ్యంతో ఎటువంటి సంబంధం లేదని అభిప్రాయపడిన చరిత్రకారులూ పలువురు ఉన్నారు. వీరిలో డిడి కోశాంబి ప్రముఖుడు. మహాభారతంలో ప్రస్తావితమైన ద్వారక ఆఫ్ఘానిస్తాన్‌లో ఉండవచ్చని కోశాంబి అభిప్రాయం. ఆ దేశంలో దారవాజ్ అనే ప్రదేశాన్ని ఆయన ఎత్తి చూపారు.

సంస్కృతంలో ద్వారక అంటే ద్వారం (గేట్) అని అర్థం. పశ్చిమాసియాతో భారత్ వ్యాపార వాణిజ్యాలకు ద్వారక ఒక ప్రముఖ కేంద్రంగా ఉండేది. గల్ఫ్ ప్రాంతాల సాగర వనరులను తమ వాణిజ్యానికి భారతీయ వ్యాపారులు బాగా ఉపయోగించుకునేవారు. సముద్రంలో మునిగిపోయిన ద్వారకలో లభ్యమైన వివిధ పురావస్తు సాక్ష్యాధారాల ప్రకారం ఆ ద్వారక ఒక నగర రాజ్యమని పురావస్తు శాస్త్రవేత్త ఎస్ఆర్ రావు తెలిపారు. ఈ నగర రాజ్యం క్రీస్తు పూర్వం 1500 సంవత్సరం నాటిదై ఉండవచ్చన్నది ఆయన అభిప్రాయం. భూమి మీద, సముద్రంలోను ద్వారకకు సంబంధించిన పురావస్తు తవ్వకాలలో బయల్పడిన వస్తువులు, కట్టడాలకు ప్రాచీన గ్రంథాలలో ప్రస్తావితమైన వాటితో సంబంధం ఉన్నదని తెలుపుతూ ఈ ఆవిష్కరణ కృష్ణుడి ద్వారకను ఒక కట్టుకథ నుంచి ఒక చారిత్రక వాస్తవంగా మార్చివేసిందని ఎస్ఆర్ రావు వ్యాఖ్యానించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో సముద్రాంతర్గత ద్వారకా నగరాన్ని చూడాలన్న ఆసక్తి సామాన్య ప్రజలకు కూడా కలగడం సహజం. అరేబియా సముద్రం మింగివేసిన ద్వారకా నగరం ఎంత పెద్దది, మునిగిపోయిన ఆ నగరంలోని కట్టడాలు ఇంకా అలానే ఉన్నాయా? సముద్ర గర్భంలో మునిగిపోయిన ద్వారక నగరాన్ని పర్యాటకులు సందర్శించేందుకు వీలుగా గుజరాత్ ప్రభుత్వం ఒక సబ్‌మెరైన్ నిర్వహణకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో, అనేకమంది ప్రజల ఆకాంక్ష ఫలించే రోజు త్వరలోనే రానుంది.

– కార్తికేయ రావు