
ఉమ్మడి కడప జిల్లాలో ప్రసిద్ధిచెందిన శైవ క్షేత్రం నిత్యపూజస్వామి ఆలయం ఏళ్లతరబడిగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. దేవదాయశాఖ పరిధిలోని ఈ ఆలయానికి ఏటా రూ.లక్షల్లో ఆదాయం వస్తోంది. సుమారు రూ.కోటి శాశ్వత నిధి ఉన్నా నేటికీ ఆలయం గోపురాలకు కూడా నోచుకోలేని దయనీయ స్థితిలో ఉండడంపై భక్తులు ఆవేదన చెందుతున్నారు. సిద్దవటం మండలం వంతాటిపల్లె శివారులోని లంకమల అభయారణ్యంలో వందల ఏళ్ల కిందట నిత్యపూజస్వామి వెలిశారు. ఇక్కడ ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఇక్కడ అధునాతన రీతిలో గుడి, గోపురాలు నిర్మాణానికి 2017లో ఆలయ నిధి రూ.13 లక్షలతో పాటు సర్వశ్రేయ నిధి కింద రూ.52 లక్షలు మంజూరయ్యాయి. గర్భగుడి, గోపురం, మూడు అంతస్తులతో మండపాలు, సమీపంలో కల్యాణ కట్ట, మరికొన్ని అభివృద్ధి పనులు చేయాల్సి ఉంది. ఏళ్లు గడుస్తున్నా అటవీశాఖ అనుమతులు రాలేదంటూ దేవదాయశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఏటా భక్తులు సమర్పించే తలనీలాల వేలం, హుండీ కానుకలతో ఏటా రూ.12 లక్షలకుపైగా ఆదాయం వస్తోంది. ఇప్పటి వరకు ఆలయానికి సంబంధించి సుమారు రూ.1.07 కోట్ల శాశ్వత నిధి ఉంది. గుడి, గోపురాల నిర్మాణపనులకు మంజూరైన రూ.65 లక్షలు మూలుగుతున్నాయి.
ఏటా భక్తులకు తప్పని కష్టాలు
పనులు చేపట్టకపోవడంతో పురాతన కాలం నుంచి మూలవిరాట్ కొండపేటు కిందే దర్శనమిస్తోంది. మహాశివరాత్రి రోజుల్లో భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తుండగా, గర్భ గుడి వద్ద ఇరుగ్గా ఉండి తోపులాటలు చోటుచేసుకుంటోంది. ఆలయ పరిసరాల్లో విడిది కేంద్రాలు, నీటి గుండాల వద్ద శాశ్వత భవనాలు, మంచినీటి సౌకర్యం, కల్యాణ కట్ట, స్వామివారి కల్యాణ వేదిక, రాక పోకలకు సరైన రహదారి లేక ఏళ్లతరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మహాశివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి.
అటవీశాఖ అనుమతులు అవసరం
నిత్యపూజస్వామి ఆలయం రిజర్వు అటవీ ప్రాంతంలో ఉన్నందున అభివృద్ది పనులు చేపట్టడానికి వారి అనుమతి తప్పనిసరి. దీనిపై ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోవాలి. దాతలు, దేవదాయశాఖ సహకారంతో కోవెలలో చిన్నపాటి పనులు మాత్రమే చేపడుతున్నాం.
–మోహన్‌రెడ్డి, ఆలయ బాధ్య ఈవో





