
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మూడవ సర్సంఘచాలక్ శ్రీ మధుకర్ దత్తాత్రేయ దేవరస్ ముద్దుపేరు బాలాసాహెబ్ దేవరాస్. ‘సేవా కార్యకలాపాల ద్వారా సామాజిక సామరస్యం మరియు సామాజిక అభ్యున్నతికి’ మార్గదర్శకుడిగా ఆయన ప్రసిద్ధి చెందారు. బాల్యం నుంచి జీవితంలో చివరి క్షణాల వరకు సమాజంలో నెలకొన్న దురాచారాలు, అసమానతలను తొలగించేందుకు ఎన్నో ప్రణాళికలు రచించారు. ఈ కారణంగానే బాలాసాహెబ్‌ను సామరస్యానికి మార్గదర్శిగా పరిగణిస్తారు. హిందూ సమాజంలో సామరస్యాన్ని, అసమానతలను తొలగించేందుకు 1974లో పూణేలో నిర్వహించిన ‘వసంత్ లెక్చర్ సీరీస్’లో ఆయన చెప్పిన విషయాలు నేటికి సంబంధితంగానే ఉన్నాయి. “మనందరి మనస్సులలో సామాజిక అసమానతలను నిర్మూలించాలనే లక్ష్యం ఉండాలి. అసమానత మన సమాజాన్ని ఎలా బలహీనపరిచి, విచ్ఛిన్నం చేసిందో స్పష్టంగా ప్రజల ముందు ఉంచాలి. దీన్ని తొలగించే మార్గాలను సూచించాలి మరియు ప్రతి వ్యక్తి ఈ ప్రయత్నానికి సహకరించాలి’’, అని ఆయన ఉద్భోదించారు.
సామాజిక సామరస్యం, అణగారిన, దళిత మరియు దోపిడీకి గురైన సమాజం యొక్క అభ్యున్నతి కోసం దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్న బాలాసాహెబ్ దేవరస్ 1915 డిసెంబర్ 17న నాగపూర్‌లో జన్మించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపన తర్వాత, బాలాసాహెబ్ దేవరస్ సంఘ వ్యవస్థాపకులు పరమ పూజ్యనీయ సర్సంఘచాలక్ డాక్టర్ కేశవరావు బలిరామ్ హెడ్గేవార్‌తో పరిచయం ఏర్పడింది. నాగ్‌పూర్‌లోని మోహితే వాడలో స్థాపించిన మొదటి శాఖకు బాలా సాహెబ్ దేవరస్ స్వచ్ఛంద సేవకుడు. సంఘతో ఆయనకు సాన్నిహిత్యం పెరగడంతో పాటు డాక్టర్ హెడ్గేవార్ జీ స్ఫూర్తితో సంఘ ద్వారా తన జీవితమంతా జాతీయ కార్యానికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. సంఘ పని విధానం మరియు కార్యక్రమాల అభివృద్ధిలో బాలాసాహెబ్ విశేష కృషి చేశారు. గణవేష్, భౌతిక, మేధోపరమైన కార్యక్రమాలు మరియు పాటలు మొదలైనవాటిని నిర్ణయించడంలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. శాఖల విస్తరణతో పాటు, స్వయం సేవకుల్లో గుణాత్మక పెరుగుదల కోసం శీతాకాలపు శిబిరాలు, వన విహార్ కార్యక్రమాలు మరియు నైపుణ్య తరగతులను ఆయన ప్రారంభించారు.
1948లో గాంధీ హత్యకు సంబంధించిన తప్పుడు ఆరోపణతో సంఘ పై నిషేధం విధించారు. ఆ సమయంలో కేంద్రంలోని నెహ్రూ ప్రభుత్వం అప్పటి సర్ సంఘచాలకులు మాధవరావు సదాశివరావు గోల్‌వాల్కర్‌జీ తో సహా అధికారులు, కార్మికులందరినీ జైలులో పెట్టింది. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా బాలాసాహెబ్ సమర్థ నాయకత్వంలో స్వచ్ఛంద సేవకులు దేశవ్యాప్తంగా సత్యాగ్రహం చేశారు. దీంతో ప్రభుత్వం బేషరతుగా సంఘంపై నిషేధాన్ని ఎత్తివేయాల్సి వచ్చింది. బాలాసాహెబ్ దేవరస్ 1965లో సర్ కార్యవాహ్ అయ్యారు. శ్రీ గురూజీ మరణానంతరం 1973లో సర్ సంఘ్ చాలక్ అయ్యారు. దీని తరువాత, ఆయన సంఘ పనిని వేగవంతం చేయడానికి దేశవ్యాప్తంగా పర్యటించారు. కేవలం రెండు సంవత్సరాల తరువాత, ఇందిరా గాంధీ తన రాజకీయ ఆశయాల కారణంగా 1947 జూలై 4న సంఘ నిషేధించబడింది. సంఘ పై విధించిన ఈ నిషేధాన్ని చాలా ఓపికగా ఎదుర్కొన్నారు. బాలాసాహెబ్ 21 నెలల పాటు పూణె జైలులో బందీగా ఉంచబడ్డారు. ఈ సమయంలో ఆయన ఉదారవాద ఆలోచనలు మరియు ప్రవర్తన జైలులో ఉన్న రాజకీయ పార్టీల కార్యకర్తలను సంఘకు దగ్గర చేసింది. ఆయన స్ఫూర్తితో కాంగ్రెస్, కమ్యూనిస్టులు మినహా మిగిలిన అన్ని సామాజిక, మత, రాజకీయ సంస్థలు కలిసి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్త సత్యాగ్రహాన్ని నిర్వహించాయి. ఫలితంగా, సంఘ పై నిషేధం ఎత్తివేయబడింది. ఆ తర్వాత 1977 ఎన్నికలలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవి చూసింది. స్వయంగా ఇందిరా గాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు.
1983లో తమిళనాడు మీనాక్షిపురంలో హిందువులు ఇస్లాంలోకి సామూహికంగా మారారు. ఈ ఘటన యావత్ దేశంలోని హిందువులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ సవాలును ఎదుర్కొనేందుకు బాలాసాహెబ్ దేవరాస్ మార్గదర్శకత్వంలో దేశవ్యాప్తంగా ఏకాత్మ యాత్రను చేపట్టారు. ఈ యాత్ర ద్వారా దేశంలో అపూర్వమైన ప్రజా చైతన్యం చోటు చేసుకుంది. అలాగే, శ్రీరామ జన్మభూమి ముక్తి ఉద్యమంలో హిందూ శక్తి యొక్క గొప్ప రూపం వ్యక్తమైందని అందరికీ తెలుసు. దేశంలోని దాదాపు అన్ని సామాజిక, మత సంస్థలు ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి. 1992 డిసెంబర్ 6న శ్రీరామ జన్మభూమి వద్ద వివాదాస్పద కట్టడాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. దీని తరువాత సెక్యులర్ పార్టీలు మరియు ముస్లిం మత ఛాందసవాదులు ఈ ఉద్యమం గురించి హల్ చల్ సృష్టించారు. అయితే ‘‘అప్పట్లో శ్రీ రామజన్మభూమి వద్ద వివాదాస్పద కట్టడాన్ని కూల్చివేసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం ప్రజలు విలపిస్తున్నారని, కానీ, లెక్కలేనన్ని హిందువుల దేవాలయాలు, మఠాలను ధ్వంసం చేసినప్పుడు అక్కడ ఆస్తులు దోచుకున్నప్పుడు, హిందువులు ఎంత బాధను అనుభవించారో? ముస్లిం సమాజం ఎప్పుడైనా ఆలోచించిందా’’, అని సర్సంఘచాలక్ బాలసాబ్ దేవరాస్ చాలా తీవ్రతతో ప్రశ్నించారు. ఆ సమయంలో సంఘ కోరుకుంటే, ఒక ఆలయాన్ని నిర్మించగలదు కానీ శ్రీరాముని ఆలయాన్ని నిర్మిస్తే, ఆ ఆలయం సంఘ లేదా విశ్వ హిందూ పరిషత్‌కి సంబంధించనిదిగా ప్రజలు భావిస్తారని బాలాసాహెబ్ విశ్వసించారు. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని, దేశంలో నివసించే ప్రతి వ్యక్తి, ప్రతి రాజకీయ పార్టీ శ్రీరామ మందిర నిర్మాణానికి ముందుకు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.
బాలాసాహెబ్ సర్సంఘ చాలక్‌గా ఉంటూనే సంఘ పనికి అనేక కొత్త కోణాలను జోడించారు. పేద జనావాసాల్లో నిర్వహించే సేవా కార్యక్రమాలు వీటిలో ముఖ్యమైనవి. దీంతో అక్కడ జరుగుతున్న మతమార్పిడి ప్రక్రియ నిలిచిపోయింది. అనేక సంస్థలు స్వయం సేవకులతో ప్రాంతీయ స్థాయిలో స్థాపించబడ్డాయి. బాలాసాహెబ్ దేవరస్ హయాంలోనే సంఘ విస్తరణ దేశమంతటా తహసీల్ స్థాయికి చేరుకుంది. ఒకవైపు దేశవ్యాప్తంగా శాఖలను పెద్ద ఎత్తున విస్తరించడమే కాక, మరోవైపు వాటి అనుబంధ సంస్థల బలాన్ని సైతం గణనీయంగా పెంపొందించారు. బాలాసాహెబ్ ‘హిందువులు మేల్కున్నప్పుడు ప్రపంచం మేల్కొంటుంది’, ‘నర సేవా నారాయణడి సేవ’ అని ప్రకటించారు. ఆయన హయాంలో దేశవ్యాప్తంగా వేలాది సేవా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బాలా సాహెబ్ దేవరాస్ కరంజాలోని తన పూర్వీకుల ఆస్తిని విక్రయించి, దాని నుండి వచ్చిన డబ్బుతో నాగ్‌పూర్-వార్ధా రహదారిలో ఉన్న ఖాప్రీలో 20 ఎకరాల భూమిని కొనుగోలు చేసి భారతీయ ఉత్కర్ష్ మండల్‌కు విరాళంగా ఇచ్చారు. ఖాప్రిలో ఉన్న ఈ భూమిలో గ్రామీణ బాలబాలికల భారతీయ ఉత్కర్ష్ మందిర్, గోశాల, స్వామి వివేకానంద మెడికల్ మిషన్ పేరుతో ఒక ఆసుపత్రి గ్రామస్తుల సేవ కోసం పనిచేస్తున్నాయి. బాలాసాహెబ్ స్ఫూర్తితో “భారతీయ ఉత్కర్ష్ ట్రస్ట్” స్థాపించబడింది.
మధుమేహం ఉన్నప్పటికీ, బాలాసాహెబ్ 1994 వరకు సర్సంఘ చాలక్‌గా పనిచేశాడు. ఆయన 1996 జూన్ 17న ఈ లోకం నుండి వెళ్లిపోయారు. ఆయన కోరిక మేరకు, రేషింబాగ్‌కు బదులుగా నాగ్‌పూర్‌లోని సాధారణ పౌరుల శ్మశాన వాటికలో దహనం చేశారు. బాలాసాహెబ్ భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ సమాజానికి, సంఘకు ఆయన నిరుపమాన సేవలు అందించారు. ‘దోపిడీకి అవకాశం లేని, ఎలాంటి దురాచారం లేని, సమానత్వంతో కూడిన హిందూ సామాజిక వ్యవస్థ నిర్మాణమే సంఘ లక్ష్యం’ అంటూ సంఘ లక్ష్యాన్ని తనదైన శైలిలో విశదీకరించిన బాలాసాహెబ్ సదా స్మరణీయులు, స్ఫూర్తిప్రదాతలు.





