News

డీఎంకే ఎంపీకి తడిచేలా గవర్నర్ తమిళ సై స్ట్రాంగ్ కౌంటర్..తగ్గేదేలే

378views

ఉత్తరాది రాష్ట్రాలు గోముద్ర‌కు సంకేతమ‌ని, గోమూత్రానికి కాదు అని తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై సౌంద‌ర‌రాజ‌న్ అన్నారు. అహ్మదాబాద్‌లోని గుజ‌రాత్ యూనివ‌ర్సిటీలో జ‌రిగిన క‌ల్చ‌ర‌ల్ ఎకాన‌మీ కాన్‌క్లేవ్‌లో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల లోక్‌స‌భ‌లో డీఎంకే ఎంపీ సెంథిల్‌కుమార్ మాట్లాడుతూ ఉత్త‌రాది రాష్ట్రాల‌ను గోమూత్ర రాష్ట్రాలంటూ కామెంట్ చేసిన విష‌యం తెలిసిందే. గోమూత్ర రాష్ట్రాల్లోనే బీజేపీ గెలిచిన‌ట్లు ఆయ‌న ఆరోపించారు. ఎంపీ సెంథిల్ చేసిన వ్యాఖ్య‌లు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై అన్నారు.

తాను త‌మిళ‌నాడు రాష్ట్రానికి చెందిన వ్య‌క్తిని అని, కొంద‌రు ఉత్త‌ర‌-ద‌క్షిణ రాష్ట్రాల మ‌ధ్య వ్యాఖ్య‌లు చేయ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని, త‌మిళ‌నాడుకు చెందిన ఓ ఎంపీ ఆ వ్యాఖ్య‌లు చేయ‌డం బాధ క‌లిగించిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. ఉత్త‌రాది రాష్ట్రాలు ప‌విత్ర‌కు సంకేతమైన గోముద్ర రాష్ట్రాలు అని, అవి గోమూత్ర రాష్ట్రాలు కాదు అని ఆమె అన్నారు. ఇలాంటి విభ‌జ‌న ఉండ‌వ‌ద్దు అన్నారు.

పురాత‌న కాలంలో త‌మిళ ప్ర‌జ‌లు త‌మ ఇండ్ల‌ల్లో దేవుడి ముందు హూండిని పెట్టుకుని దాంట్లో రోజు డ‌బ్బులు వేసేవాళ్లు అని, జ‌మ అయిన ఆ సొమ్ముతో కాశీ యాత్ర చేసేవాళ్లు అని గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై తెలిపారు. దేశ ప్ర‌జ‌లు ఆధ్మాత్మికంగా ఒక్క‌టై ఉన్నార‌ని, కానీ ప్రాంతీయంగా వాళ్ల‌ను వేరు చేయ‌డం స‌రికాదు అని అన్నారు. ప్ర‌జ‌ల్ని ఎలా విభ‌జిస్తారని, ఆధ్యాత్మికంగా ఒక్క‌టయ్యార‌ని, రాజ‌కీయంగా కొంద‌రు విభ‌జ‌న చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని, కానీ వాళ్లు ప్ర‌య‌త్నాలు ఏమీ ఫ‌లించ‌వ‌ని, ఎందుకంటే అంద‌రూ ఆధ్యాత్మికంగా ఒక్క‌టై ఉన్న‌ట్లు ఆమె తెలిపారు.

త‌మిళ‌నాడులో కాశీ, రామేశ్వ‌రంను ప్ర‌జ‌లు వేరువేరుగా చూడ‌ర‌ని, కాశీ వెళ్లిన వారు రామేశ్వ‌రం వెళ్తార‌ని, అలాగే రామేశ్వ‌రం వెళ్లిన వాళ్లు.. కాశీకి ఆధ్యాత్మిక టూర్ చేస్తార‌ని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై అన్నారు. ఉత్త‌రాది-ద‌క్షిణాది మ‌ధ్య అగాధాన్ని పెంచ‌వ‌ద్దు అని, కాశీ ప‌ట్ట‌ణం ఉత్త‌రంలో ఉంద‌ని, త‌మిళ‌నాడులో టెన్‌కాశీ ఉంద‌న్నారు. మ‌న సంస్కృతులు ఒక్క‌టి కావ‌డం వ‌ల్ల‌.. మ‌న‌ల్ని ఎవ‌రూ విడ‌దీయ‌లేర‌ని ఆమె తెలిపారు.