News

అభ్యంతరాలు ఉంటే చెప్పండి..భక్తులకు టీటీడీ కీలక సూచన

298views

స్విమ్స్ ఆసుపత్రి భవనాల పునరుద్ధరణ పనులను రూ.197 కోట్లతో చేపట్టడానికి టెండరు డాక్యుమెంట్లను జ్యుడీషియల్ ప్రివ్యూకు సమర్పించారు. తిరుమలకు విచ్చేయు భక్తుల వైద్య సౌకర్యార్థమై, పరిసర ప్రాంత రోగులకు మైరుగైన సౌకర్యాలను అందించడానికి పనులు చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ పనులకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలుంటే ఈనెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు తెలియజేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి ఏవైనా సలహాలు, అభ్యంతరాలను apjudicialpreview@gmail.com కు లేదా cettdtpt@gmail.com కానీ మెయిల్ ద్వారా తెలియజేయాలని కోరారు. ఇతర వివరాల కోసం https://judicialpreview.ap.gov.in అలాగే www.tirumala.org వెబ్ సైట్ లను సంప్రదించాలని సూచించారు.

డిసెంబరు 17వ తేదీ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 17వ తేదీన తెల్లవారుజామున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ ఉదయం నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా ధనుర్మాస ఘడియలు 2024 జనవరి 14న ముగియనున్నాయి.

పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. 12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు.

ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.