ArticlesNews

సనాతన ధర్మమే జాతీయ ధర్మం.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన యోగి ఆదిత్యనాథ్‌..! అసలు ఆయన ఏమన్నారంటే?

96views

సనాతన ధర్మమే భారతదేశ జాతీయ ధర్మమని, సనాతన ధర్మమే భారత్‌కు గుర్తింపు అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాజస్థాన్‌లోని జలోర్‌లో ఇటీవల చేసిన ఈ వ్యాఖ్యలనే ఆయన ఓ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పునరుద్ఘాటించారు. జలోర్‌లో 1,400 ఏళ్ల క్రితం నాటి ఆలయాన్ని పునర్మిర్మాణం చేసిన సందర్భంగా సనాతన ధర్మంపై తాను వ్యాఖ్యలు చేసినట్టు చెప్పారు. ”ప్రతి దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సొంత ఆత్మ ఉంటుంది. సనాతన ధర్మమే ఇండియాకు బలం, లైఫ్ ఎనర్జీ. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న దశలోనూ ఏ ఒక్కరూ సనాతన ధర్మానికి హాని చేయలేకపోయారు. ఇదే విషయాన్ని జలోర్ సభలో చెప్పాను” అని యోగి ఆదిత్యనాథ్ వివరించారు.

”సనాతన ధర్మం శక్తి గురించి చెప్పాలంటే.. ఇది నాది అని మనం చెప్పం. అది మీది కూడా. యావత్ ప్రపంచం వసుధైక కుటుంబం అని మనం చెబుతాం. అదే సనాతన ధర్మం. దీనిని ఏ మతంతోనో, శాఖతోనూ పోల్చడానికి లేదు. ఆ కారణంగానే ఇండియాను సనాతన ధర్మంగా గుర్తించాలని నేను చెప్పదలచుకున్నాను. అందుకు మనమంతా గర్వించాలి” అని యోగి అన్నారు.

ధర్మం అంటే అర్థం ఇదే..
ధర్మం వేరు మతం వేరని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరికీ ధర్మం అనేది ఉంటుందని అన్నారు. ఉదాహరణకు ఒక పెన్నును తీసుకుంటే.. పెన్నుకు ఉన్న ధర్మం రాయడమనే కర్మ చేయడమని తెలిపారు. ధర్మమంటే మతమో, ప్రార్థనో, ఆచార వ్యవహారాలో కాదని అన్నారు. అయితే…. ధర్మాన్ని మతంతోనో, శాఖతోనే పోల్చిచూసే వాళ్లు తన మాటలతో ఏకీభవించకపోవచ్చని తెలిపారు. ధర్మమంటే నిజమైన అర్థం తెలిసిన వాళ్ల తన వ్యాఖ్యలతో ఏకీభవిస్తారని సీఎం యోగి చెప్పారు.

ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఇలా..
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జనవరి 28న జలౌర్‌లో జరిగిన సభలో సనాతన ధర్మమే జాతీయ ధర్మమని వ్యాఖ్యానించారు. బ్రాహ్మణులను, గోవులను కాపాడాలన్నారు. గతంలో విధ్వంసానికి గురైన పవిత్ర మందిరాల పునఃస్థాపన జరగాలని అన్నారు. 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో భవ్య రామాలయ నిర్మాణం జరుగుతుందని, వచ్చే ఏడాది ఈ సమయానికి (జనవరి నెలాఖరుకు) అందరూ శ్రీరాముడిని దర్శించుకోగలుగుతామని అన్నారు. దేశంలో విధ్వంసానికి గురైన అన్ని దేవాలయాలను మళ్లీ నిర్మించాలని యోగి పిలుపునిచ్చారు.