
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఖలిస్థాన్ (Khalistan) ఉగ్రవాద సంస్థకు చెందిన స్లీపర్ సెల్స్ చురుగ్గా, క్రియాశీలంగా ఉన్నట్లు నిఘా వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలియజేసింది. ఇటీవల పశ్చిమ ఢిల్లీ ప్రాంతాల్లో ఖలిస్థాన్ అనుకూల పోస్టర్లు, పెయింటింగ్‌లు బయటపడటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ స్లీపర్ సెల్స్ ఉగ్రవాద దాడులకు పాల్పడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోందని పేర్కొంది.
ఢిల్లీ నగరంలోని వికాస్‌పురి, జనక్‌పురి, పశ్చిమ్ విహార్, పీరగఢి, ఇతర పశ్చిమ ఢిల్లీ ప్రాంతాల్లో అభ్యంతరకరమైన నినాదాలు, చిత్రాలు కనిపించాయి. ఇదంతా భారీ కుట్రలో భాగంగా జరుగుతోందని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. పోలీసులు వెంటనే స్పందించి, ఖలిస్థాన్ అనుకూల చిత్రాలు, నినాదాలను తొలగించారు. ఇవి కనిపించకుండా రంగులు వేశారు. ఐపీసీ సెక్షన్లు 153-బీ, 120బీ ప్రకారం కేసు నమోదు చేశారు. రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించినట్లు, నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు గుర్తు తెలియని వ్యక్తులపై ఆరోపణలు నమోదు చేశారు. పోలీసులు ఈ ప్రాంతాల్లో గస్తీని మరింత పెంచారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను స్కాన్ చేశారు.





