News

తిరుమల శ్రీవారి రథసప్తమికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు!

335views

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధర్వర్యంలో శనివారం నుంచి వార్షిక శ్రీ వారి రథసప్తమి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ పి. పరమేశ్వర రెడ్డి తిరుమలలోని వాహన మండపం, మాడ వీధులు, పుష్కరిణి, గేలరీ లు, ఎంట్రీ ఎగ్జిట్ గేట్లను పరిశీలించారు. ఆ తర్వాత రథసప్తమి నిర్వహణకు అవసరమైన పోలీసు బందోబస్తు ఏర్పాట్ల గురించి అధికార యంత్రాంగానికి సూచనలు చేశారు. అదేవిధంగా అత్యవసర వాహనాలకు, ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ… శ్రీవారి రథసప్తమి అతి ముఖ్యమైన, పవిత్రమైన రోజు కావడంతో.. ఈ సందర్భంగా నిర్వహించే ఉత్సవాలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒకే రోజు మాడ వీధులలో స్వామి వారు భక్తులకు దర్శనం ఇస్తారని ఈ ఉత్సవాలకు.. సుదూర ప్రాంతాల నుండి కూడా అశేషంగా భక్తులు వస్తారని తెలిపారు. ఈక్రమంలో గంట గంటకు వాహన సేవలు ఉన్నందున అధికారులు, సిబ్బంది అప్రతంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ముఖ్యంగా ఉదయం సూర్యప్రభ వాహనం, గరుడ వాహనం మరియు చక్ర స్నానానికి భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది కావున దానికి అనుగుణంగా పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు రక్షణ, భద్రత కల్పించే బాధ్యత పోలీస్ వారిపై ఉంటుందన్నారు. భక్తులతో ప్రేమగా, మర్యాదపూర్వకంగా మెలగి రథసప్తమి రోజున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకొనే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.

తిరుపతి , తిరుమల ప్రాంతాల్లో పోలీసు వారి సూచనల ప్రకారం ట్రాఫిక్ నిమయ నిబంధనలు పాటిస్తూ వాహనాలకు కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లో మాత్రమే పార్కింగ్ చేసి పోలీసు శాఖ కు మరియు ఇతర భక్తులకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.