
విజయవాడలో కనుకదుర్గ ఫ్లై ఓవర్ నిర్మాణం సమయంలో అక్కడ ఉన్న తొమ్మిది ఆలయాలను అప్పట్లో అధికారులు తొలగించారు. ఇది జరిగి రెండేళ్లు గడుస్తున్నా ఆ ఆలయాలు పునరుద్ధరణకు నోచుకోలేదు. ఈ తొమ్మిది ఆలయాల నిర్మాణానికి రూ. 1.79 కోట్లను సైతం కేటాయించారు. అప్పటి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఏడాది లోపే తొలగించిన తొమ్మిది ఆలయాలను నిర్మిస్తామని భక్తులకు మాట ఇచ్చారు. ఈక్రమంలో శనీశ్వరుని ఆలయం, కనక దుర్గ నగర్లోని శ్రీ కృష్ణుని ఆలయానికి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఆలయాల నిర్మాణం మాత్రం పూర్తికాలేదు. ఇందులో కొన్నింటిని నిర్మించినప్పటికీ ఇప్పటి వరకు వాటిని ప్రారంభించలేదు. రూ 48 లక్షలతో నిర్మించిన దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి ఆలయం, సీతమ్మ పాదాలు, బొడ్డు బొమ్మ గత ఆరు నెలలుగా ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో ఆయా ఆలయాల్లో చెత్త పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉండటంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.





