News

ఇండో-పాక్ సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్ ‘ఆపరేషన్ అలర్ట్’!

277views

గణతంత్ర దినోత్సవాలను దృష్టిలో ఉంచుకుని భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్ ఏడు రోజుల ‘ఆపరేషన్ అలర్ట్’‌ను ప్రారంభించింది. గుజరాత్‌లోని కచ్, రాజస్థాన్‌లోని బర్మెర్ జిల్లాలో బీఎస్ఎఫ్ జవాన్లు ఈ ఆపరేషన్ అలర్ట్‌లో పాల్గొంటున్నారు. ఇండో-పాక్ సరిహద్దు వెంబడి భద్రతను మరింత పెంచారు. శనివారం నాడు ప్రారంభమైన ఈ ‘ఆపరేషన్ అలర్ట్’ ఈనెల 28వ తేదీ వరకూ కొనసాగుతుందని అధికారులు తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా సంఘ వ్యతిరేక శక్తుల దుశ్చర్యలు తిప్పికొట్టేందుకు ఈ ఆపరేషన్ అలర్ట్ నిర్వహిస్తున్నట్టు బీఎస్ఎఫ్ గుజరాత్ ఫ్రాంటియర్ ఒక ప్రకటనలో తెలిపారు.

గుజరాత్‌లోని కచ్ వెంబడి ఇండో-పాక్ సరిహద్దున అత్యంత సున్నితమైన ప్రాతంగా భావిస్తుంటారు. చేపల వేట కోసం బోట్లపై భారత జలాల్లోకి పాక్ జాతీయులు అనేకమార్లు అడుగుపెట్టడం, పట్టుబడటం వంటివి జరిగాయి. ఒక్క 2022లోనే గుజరాత్ ప్రాంతంలో 22 మంది పాక్ మత్స్యకారులను పట్టుకుని, 79 పడవలను, రూ.250 కోట్లు విలువచేసే హెరాయిన్, రూ.2.49 విలువచేసే మాదకద్రవ్యాలను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. సరిహద్దుల్లో భద్రతను మరింత పెంచడంలో భాగంగా వ్యూహాత్మకమైన సర్ క్రీక్, హరామీ నాలా ఏరియాలో ‘పెర్మనెంట్ వర్టికల్ బంకర్స్’ నిర్మాణం జరగుతున్నట్టు బీఎస్ఎఫ్ వర్గాలు గతంలో తెలిపాయి. బుజ్ సెక్టార్ వెంబడి 8 మల్టీ-స్టోరీ బంకర్లు-అబ్జర్వేషన్ పోస్టుల నిర్మాణానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రూ.50 కోట్ల మేరకు నిధులు కూడా మంజూరు చేసింది. పాకిస్థాన్ మత్స్యకారులు, పడవల చొరబాటు నిరంతరాయంగా సాగుతున్న నేపథ్యంలో గట్టి నిఘా, చర్యల కోసం హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది.