News

ఆ పూజారిని జైల్లో పెట్టాలి.. రామచరిత్‌ మానస్‌ బోధిస్తున్న వ్యక్తిపై సమాజ్‌ వాదీ పార్టీ నేత అనుచిత వ్యాఖ్యలు!

279views

మధ్యప్రదేశ్‌ ఛత్తార్‌పూర్‌ జిల్లాలోని బాగేశ్వర్ ధామ్ ఆలయ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రి‌ని జైలుకు పంపాలని సమాజ్ వాదీ పార్టీ నేత ప్రసాద్ మౌర్య డిమాండ్ చేయడం కలకలం రేపుతోంది. మహాకవి తులసీదాస్ రచించిన రామ చరిత మానసములోని రామాయణ పద్యాలను బాగేశ్వర్ ధామ్ ఆలయ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రి‌ భక్తులకు కథలుగా చెబుతుంటారు. అంతేకాదు హనుమాన్ చాలీసా పఠనం కూడా చేయిస్తుంటారు. రామ చరిత మానస్‌తోపాటు హనుమాన్ చాలీసా కూడా అవధీ భాషలో రాసినవే. ఈక్రమంలో ఆ పూజారిని జైల్లో పెట్టాలని చెప్పడంతోపాటు.. మహాకవి తులసీదాస్ రచించిన రామ చరిత్ మానస్ ను బ్యాన్ చేయాలని ప్రసాద్‌ మౌర్య డిమాండ్‌ చేశారు. ధర్మం పేరుతో అనాదిగా దళితులకు అన్యాయం జరిగిందని, దళితులకు న్యాయం చేయని ధర్మం నాశనమవ్వాలంటూ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

బాగేశ్వర్ ధామ్‌ ధీరేంద్ర శాస్త్రిపై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ కూడా విమర్శలు చేశారు. మహిమలతో సమాజానికి మేలు జరగదని, మహిమలుంటే జోషి మఠ్‌ను కాపాడాలని సవాల్ విసిరారు. ధీరేంద్ర శాస్త్రిపై ముప్పేట విమర్శలు జరుగుతున్న సమయంలో ఆయనకు యోగా గురువు బాబా రాందేవ్ మద్దతుగా నిలుస్తున్నారు.

మరోవైపు రామ చరిత్ మానస్‌‌ను బ్యాన్ చేయాలన్న ప్రసాద్ మౌర్య డిమాండ్‌పై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మండిపడ్డారు. సనాతన ధర్మంపై విమర్శలు చేయడం, ఎగతాళి చేయడం ప్రస్తుత కాలంలో ఫ్యాషన్ గా మారిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లిం మత నాయకులను ఎవ్వరూ ఏమీ అనరని కూడా గిరిరాజ్ సింగ్ వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజుల కిందట బిహార్‌ రైల్వే మంత్రి సైతం రామచరిత్‌ మానస్‌ను బ్యాన్‌ చేయాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు హిందువులు ఆ వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించారు.