
368views
జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్‌కు తీసుకురావాలని ఆయన కుమార్తె అనిత బోస్ తాజాగా డిమాండ్ చేశారు. జర్మనీలో నివసిస్తున్న ఆమె, సోమవారం నేతాజీ జయంతి సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘బోస్ 126 ఏళ్ల క్రితం జన్మించారు. ఆయన ఒక బయటి దేశంలో అమరుడై 77 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ భారత ప్రజలు ఆయన్ను మరచిపోలేదు. సుభాష్ చంద్రబోస్ ఎటువంటి భారత్ కోసం కలలుకన్నారో ఆ దేశాన్ని సాధించే దిశగా ఆయన్ను గుర్తుచేసుకోవాలి. అన్ని దేశాలూ గౌరవించేలా, అందరికీ సమానంగా విద్యావకాశాలు అందేలా ఒక ఆధునిక దేశంగా భారత్ మారాలి. ఆయన ఆశయాలు, విలువల్ని అనుసరించడమే నేతాజీకి మనమిచ్చే ఘనమైన నివాళి. ఆయన అస్థికల్ని వెనక్కి తీసుకురావాలని కోరుతున్నా’’ అని అనిత పేర్కొన్నారు.





