News

రాహుల్‌ను ఆది శంకరాచార్యులుతో పోల్చిన జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా!

401views

నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ చీఫ్‌, జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా, రాహుల్‌ను అద్వైతాన్ని ప్రవచించిన ఆది శంకరాచార్యులతో పోల్చారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ దాకా పాదయాత్ర చేసిన మొదటి వ్యక్తి శంకరాచార్య అని.. ఆ హిందూ వైదిక తత్వవేత్త మాదిరిగానే మళ్లీ పాదయాత్ర చేస్తోంది రాహులే అని పేర్కొన్నారు. ఈ నెల 19న జమ్మూ కశ్మీర్‌లోని లఖన్‌పూర్‌లో జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన ఈ వాఖ్యలు చేశారు. భారత్‌ జోడో యాత్ర లక్ష్యం.. భారత్‌ను ఏకం చేయడమేనని.. ఈ యాత్రను వ్యతిరేకించే వారంతా దేశానికి, మానవాళికి శత్రువులని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆది శంకరాచార్యులతో రాహుల్‌ను పోల్చూతు ఫరూక్‌ అబ్దుల్లా చేసిన వాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది. ‘‘హిందూ ఉగ్రవాదం’’, కాషాయ ఉగ్రవాదం’’ పదాల సృష్టికర్త అయిన రాహుల్‌ను శంకరాచార్యతో పోల్చడమా? అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా విమర్శించారు.

జమ్మూకశ్మీర్‌కు చేరిన జోడోయాత్ర..
రాహుల్‌ యాత్ర కశ్మీర్‌కు చేరింది. ‘జోడోయాత్ర జమ్మూకశ్మీర్‌ చేరుకోవడం ఆనందంగా ఉంది. నా సొంతింటికి వచ్చిన భావన కలుగుతోంది. నా మూలాలు ఇక్కడే ఉన్నాయి’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. కాగా, యాత్రలో మంచు కురుస్తుండడంతో రాహుల్‌ మొదటిసారి జాకెట్‌ ధరించారు. అయితే అది రెయిన్‌ కోట్‌ అని కాంగ్రెస్‌ తెలిపింది. ఇదిలా ఉండగా, శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ శుక్రవారం జోడో యాత్రలో పాల్గొన్నారు.