
సార్వత్రిక ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రచార పర్వంలో బంగ్లాదేశ్ కు చెందిన నటీ నటులు పాల్గొంటూ వుండడం తీవ్ర వివాదాంశంగా మారుతోంది.
సోమవారం నాడు బంగ్లాదేశీ నటుడు ఫిర్దోస్ అహ్మద్ రాయగంజ్ లో జరిగిన తృణమూల్ కాంగ్రెస్ నిర్వహించిన రోడ్ షో లో పాల్గొని ఆ పార్టీ తరపున ప్రచారం నిర్వహించారు. ప్రాంతీయ విదేశీ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఇచ్చిన నివేదిక ప్రకారం దీనిపై విచారణ జరిపిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బంగ్లాదేశ్ నటుడు ఫిర్దోస్ వీసాను రద్దు చేసి ఆయనను దేశం విడచి వెళ్లవలసినదిగా ఆదేశించింది.

తృణమూల్ ర్యాలీలో బంగ్లాదేశీ నటుడు ఫిర్దోస్ అహ్మద్ (కుడి చేతి వైపు )
అదే రోజు ఫిర్దోస్ లాగే టెలి సీరియల్ నటుడు గాజీ అబ్డున్ నూర్ కూడా తృణమూల్ అభ్యర్ధి సౌగాతా రాయ్ తరపున తృణమూల్ సీనియర్ నాయకుడు మదన్ మిమ్త్రాతో కలిసి ప్రచారం నిర్వహించారు.

బంగ్లాదేశీ నటుడు గాజి అబ్డున్ నూర్
దీనిపై ప్రత్యర్ధి BJP, ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేయగా తృణమూల్ మాత్రం యదావిధిగా తమ చర్యలను సమర్ధించుకుంటోంది. దీనిపై మదన్ మిత్రా మాట్లాడుతూ “నాకు తెలిసినంత వరకు విదేశీయులేవరూ ఎన్నికలలో పోటీ చెయ్యకూడదు. కానీ ప్రచారం ఎవరైనా నిర్వహించవచ్చు. కనుక ఇది ఎన్నికల నియమావళి ఉల్లంఘన క్రిందికి రాదు.” అని చెప్పుకొచ్చారు.





