
దేశంలోనే మొట్టమొదటిసారి మహిళా ఓటర్ల కోసం మహిళలే పోలింగ్ అధికారులుగా ‘సఖి’ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు హర్యానా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ రంజన్ ప్రకటించారు. మహిళా సాధికారతలో భాగంగా మహిళా ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు వీలుగా ఈ సఖీ పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మహిళా ఓటర్ల పోలింగ్ శాతాన్ని పెంచేందుకు తాము ఈ చర్యలు చేపట్టామని.. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాల వద్ద టాయ్‌లెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. గర్భిణులు, మూడేళ్ల లోపు వయసు గల పిల్లలున్న మహిళల కోసం పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యూ ఏర్పాటు చేశామని.. అంగన్ వాడీ కార్మికులు, డ్వాక్రా సంఘాల మహిళల్లో చైతన్యం నింపి మహిళా ఓటింగ్ శాతాన్ని పెంచుతామన్నారు. దీనిలో భాగంగా మహిళల్లో ఓటింగుపై చైతన్యం తీసుకువచ్చేందుకు జిల్లాల వారీగా రంగోలీ, మెహందీ పోటీలు నిర్వహించి ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యాన్ని మహిళలకు వివరించి చెపుతున్నామని రాజీవ్ రంజన్ వివరించారు.





