
శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు దేశం నలుమూలల నుంచి తిరుమలకు వస్తుంటారు. వాందరికీ తిరుమల తిరుపతి దేవస్థానం ఉచితంగానే అన్నప్రసాదాలను అందజేస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి భక్తులు అంతకంతూ పెరుగుతుండడంతో.. ఇతర చోట్ల అన్నప్రసాద భవానలను ప్రారంభించనున్నారు.
భక్తులకు అందుబాటులో ఉండేలా.. వారు బస చేసే అతిథి గృహాల సమీపంలోనే అన్నప్రసాద భవనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా పాత అన్నదానభవనం.. పీఏసీ-4ను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇటీవల ప్రారంభించారు.
పీఏసీ-4 మినీ అన్నప్రసాద కేంద్రంలో రోజుకు 15 వేల మందికి అన్నదానం చేస్తున్నారు. దీంతో పాటు మరో నాలుగు చోట్ల కూడా ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. శ్రీ పద్మావతి ప్రాంతంలో అన్నమయ్య భవనం, నారాయణగిరి పరిధిలో ప్రస్తుతం మూసి ఉన్న సారంగి హోటల్, SNC ఏరియాలోని జనతా క్యాంటిన్‌లో మినీ అన్నదాన భవనాలను ప్రారంభించనున్నారు.
అంతేకాదు శ్రీవారి మెట్టు నడకమార్గంలో వచ్చే భక్తుల కోసం కూడా ఎంబీసీ ప్రాంతంలో అన్నదాన కేంద్రాన్ని ప్రారంభించబోతున్నారు. మినీ అన్నప్రసాదం కాంప్లెక్స్ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించి తాత్కాలికంగా వసతులు ఏర్పాటు చేసి.. వెంటనే భక్తులను అన్న ప్రసాద పంపిణీని ప్రారంభించాలని టీటీడీ నిర్ణయించింది.
ఇవన్నీ అందుబాటులోకి వస్తే… భక్తులు అన్నప్రసాదం కోసం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. తమకు దగ్గర్లో ఉన్న మినీ అన్నప్రసాద భవనానికి వెళ్లి.. ఉచితంగానే భోజనం చేయవచ్చు.





