News

ఈశాన్య రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా.. ఎన్నికల నిర్వహణపై ఈసీ కీలక ప్రెస్‌మీట్‌!

315views

కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. దీనిలో మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోనుంది. నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ఈ సందర్బంగా కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర అసెంబ్లీల అయిదేళ్ల పదవీకాలం వరుసగా మార్చి 12, మార్చి 15, మార్చి 22వ తేదీల్లో ముగియనుంది. దీంతో మార్చి నెలాఖరులోగా మూడు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించేలా ఈసీ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ నేతృత్వంలోని పూర్తి ఎన్నికల సంఘం గత వారం మూడు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించి రాజకీయ పార్టీలు, రాష్ట్ర, కేంద్ర భద్రత, పౌర అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

ఈ ఏడాది తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగానే ఈసీ ఈ ఈశాన్య రాష్ట్రాలకు ఎలక్షన్స్ జరిపించబోతోంది. ఇవి చిన్న రాష్ట్రాలే అయినప్పటికీ… వీటిలో వచ్చే ఫలితాలు.. దేశవ్యాప్తంగా ఎన్నికల సరళిని ప్రతిబింబిస్తాయి. మరోవైపు బీజేపీ ఈ మూడు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఎందుకంటే ఈ ఫలితాలు 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎంతోకొంత ప్రభావం చూపుతాయని బీజేపీ క్యాడర్‌ భావిస్తోంది. దీంతో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తోంది. బీజేపీతోపాటు,,, ఆయా మూడు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు సైతం ఎన్నికల బరిలో గెలిచేలా కసరత్తు ప్రారంభించాయి.