News

12వ తేదీ నుంచి తిరుమల సర్వదర్శనం టోకెన్లు జారీ

320views

తిరుమల శ్రీవారి భక్తులకు ఈ నెల 12 నుంచి సమయ నిర్దేశిత సర్వదర్శన టోకెన్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. గతంలో మాదిరిగానే తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసంలో ఏ రోజుకారోజు దర్శ నానికి సంబంధించి టోకెన్లను జారీ చేయనున్నారు. ఈ నెల 2న ప్రారంభమై 11వ తేదీ వరకు కల్పిస్తున్న వైకుంఠ ద్వార దర్శనం కోసం జారీ చేస్తున్న టోకెన్లు ఆదివారం ఉదయం 10 గంటలకు పూర్తయ్యాయి.

రూ.33 లక్షలిస్తే ఒక రోజు అన్న ప్రసాద వితరణ అవకాశం….
శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్న ప్రసాదాలను అందించేందుకు ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు ఒక రోజు విరాళ పథకం కింద రూ.33 లక్షలు అందించవచ్చని టీటీడీ ఓ ప్రకటనలో తెలియజేసింది. ఉదయం అల్పాహారం కోసం రూ.7.70 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం రూ.12.65 లక్షలు, రాత్రి భోజనానికి రూ.12.65 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చని పేర్కొంది. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ప్రదర్శిస్తామని వెల్లడించింది.

12 పేజీల టీటీడీ క్యాలెండర్లు అయిపోయాయి…
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా గత సెప్టెంబరులో టీటీడీ విడుదల చేసిన 2023వ సంవత్సరానికి సంబంధించిన 12 పేజీల క్యాలెండర్లు అయిపోయాయని టీటీడీ ప్రకటించింది. 12 పేజీల క్యాలెండర్లను 13 లక్షలు ముద్రించి సెప్టెంబరు 27 నుంచి అందుబాటులోకి తెచ్చింది. వీటిని భక్తులు పూర్తిగా కొనుగోలు చేశారు. తీవ్ర డిమాండు ఉన్న ఈ క్యాలెండర్లు జనవరి ఒకటి నుంచి అందుబాటులో లేవు.